/rtv/media/media_files/2026/03/23/trump-2026-03-23-06-42-22.jpg)
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం నాలుగో వారంలోకి ఎంటరైంది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ఒక కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌లోని ప్రధాన అణు కేంద్రం ఉన్న డిమోనాతో పాటు అరద్ ప్రాంతంపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసిందని, ఈ ఘటనలో 180 మందికి గాయాలయ్యాయని వెల్లడించింది. దీనిపై ఇరాన్ స్పందిస్తూ.. తమ దేశంలోని నటాంజ్ అణు కేంద్రంపై జరిగిన దాడికి ప్రతికారంగానే ఈ చర్య తీసుకున్నామని స్పష్టం చేసింది.
అమెరికాపై ఒత్తిడి
మరోవైపు ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తున్న అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ చమురు వ్యాపారంలో నాలుగో వంతు వాటా ఉన్న హార్ముజ్ జలసంధి గుండా రవాణాను వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే 48 గంటల్లోగా ఎటువంటి బెదిరింపులు లేకుండా ఈ మార్గాన్ని పూర్తిగా తెరవకపోతే, ఇరాన్‌లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రాలతో సహా అన్ని మౌలిక సదుపాయాలను అమెరికా నేలమట్టం చేస్తుందని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.
అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కూడా అంతే ధీటుగా స్పందించింది. ఒకవేళ తమ దేశ మౌలిక సదుపాయాలపై దాడి జరిగితే, ఈ ప్రాంతంలోని అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన ఇంధన, సమాచార సాంకేతిక, మంచినీటి శుద్ధి ప్లాంట్లే లక్ష్యంగా దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. ఇరాన్‌ను మ్యాప్ నుంచి తుడిచిపెట్టాలని చూడటం మూర్ఖత్వమని, ఇలాంటి బెదిరింపులు తమ దేశ ఐక్యతను మరింత పెంచుతాయని ఆయన అన్నారు. తమ దేశంపై దాడి చేసేవారికి తప్ప, మిగిలిన అందరికీ హార్ముజ్ జలసంధి తెరిచే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ గాలిబాఫ్ మాట్లాడుతూ.. తమ దేశ విద్యుత్ కేంద్రాలపై దాడి జరిగితే, ఈ ప్రాంతంలోని ఇతర దేశాల్లో ఉన్న కీలక వనరులను కూడా తాము ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు ప్రపంచ సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తాయని, అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలగకుండా సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలు సురక్షితంగా సాగాలని మోదీ ఆకాంక్షించారు.
Follow Us