/rtv/media/media_files/2026/03/23/iran-durty-bomb-2026-03-23-12-17-24.jpg)
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సాగుతున్న భీకర పోరు ఇప్పుడు ఏకంగా నాలుగో వారంలోకి ఎంటరైంది. ఇరు పక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం మరింత అట్టుడుకుతోంది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులతో ఇరాన్ తన సైనిక సంపదతో పాటుగా ముఖ్య నేతలను కోల్పోయి ప్రస్తుతం రక్షణలో పడిపోయినట్లు కనిపిస్తోంది. అయితే, యుద్ధంలో వెనుకబడినట్లు కనిపిస్తున్న ఇరాన్, ఇప్పుడు తన అమ్ములపొదిలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన డర్టీ బాంబ్ అనే ఆయుధాన్ని ఇప్పుడు ప్రయోగించే అవకాశం ఉందన్న వార్తలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. అణు యుద్ధం వరకు వెళ్లకుండానే, శత్రువులకు భారీ నష్టాన్ని కలిగించేందుకు ఇరాన్ ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
డర్టీ బాంబ్ అంటే ఏమిటి?
అసలు ఈ డర్టీ బాంబ్ అంటే ఏమిటి అనే ప్రశ్న ఇప్పుడుఅందరిలోనూ తలెత్తుతోంది. ఇది సాధారణ అణు బాంబు కంటే ఇది చాలా భిన్నమైనది. డైనమైట్ వంటి సాధారణ పేలుడు పదార్థాలకు రేడియోధార్మిక పొడి లేదా గుళికలను కలిపి దీనిని తయారు చేస్తారు. ఇది పేలినప్పుడు భారీ విధ్వంసం జరగకపోయినా, ఆ ప్రాంతమంతా ప్రమాదకరమైన రేడియోధార్మికత వ్యాపిస్తుంది. దీనివల్ల గాలి, నీరు, భూమి పూర్తిగా కలుషితమైపోతాయన్న మాట. అక్కడి ప్రజలకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకడమే కాకుండా, ఆ ప్రాంతం నివాసయోగ్యం కాకుండా పోతుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఇది మనుషులను చంపడమే కాకుండా ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది.
ఇరాన్ వద్ద ఇలాంటి బాంబును తయారు చేసే సామర్థ్యం ఉందా అంటే, అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆస్పత్రుల్లో వాడే వైద్య పరికరాలు, పరిశ్రమల్లో ఉండే రేడియోధార్మిక పదార్థాలతో దీనిని సులభంగా తయారు చేయవచ్చు. పైగా ఇరాన్ వద్ద ఇప్పటికే అధిక మొత్తంలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. అమెరికా ప్రతినిధులు సైతం ఇరాన్ వద్ద ఉన్న ఈ నిల్వలతో డర్టీ బాంబును తయారు చేయడం చాలా తేలికైన పని అని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ఇరాన్ సర్వోన్నత నేత ఖమేనీ అణు ఆయుధాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఇటీవలి దాడుల్లో ఆయన మరణించారన్న వార్తల నేపథ్యంలో, ఇప్పుడు ఇరాన్ పగ్గాలు పూర్తిస్థాయి కఠిన నిర్ణయాలు తీసుకునే అతివాద నాయకుల చేతుల్లోకి వెళ్లాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఈ బాంబును నేరుగా కాకుండా, హిజ్బుల్లా లేదా హౌతీ వంటి తన అనుకూల వర్గాల ద్వారా ప్రయోగించే అవకాశం ఉంది. దీనివల్ల తమకు సంబంధం లేదని ఇరాన్ తప్పించుకోవడానికి వీలవుతుంది. ముఖ్యంగా రద్దీగా ఉండే నగరాలు లేదా సముద్ర మార్గాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగితే, ప్రపంచ చమురు సరఫరా ఆగిపోయి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. యుద్ధంలో ఓడిపోతామనే భయం కలిగినప్పుడు, ఇరాన్ తన చివరి ప్రయత్నంగా ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది గనుక జరిగితే, మధ్యప్రాచ్యంతో పాటు ప్రపంచం మొత్తం ఊహించని విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుంది.
Follow Us