Ground War : పశ్చిమాసియాకు చేరుకున్న అమెరికా బలగాలు.. ఇక భూతల పోరు తప్పదా?

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతోంది. ఇరాన్‌ ఇజ్రాయెల్‌ మధ్య పోరు అంతకంతకు ముదురుతుంది. ఈ క్రమంలో  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) పశ్చిమాసియాలో తన సైనిక శక్తిని మోహరిస్తుండటం సర్వత్రా చర్చనీయంశంగా మారింది.

New Update
FotoJet (13)

us army

Ground War : పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతోంది. ఇరాన్‌ ఇజ్రాయెల్‌ మధ్య పోరు అంతకంతకు ముదురుతుంది. ఒకవైపు ఇరాన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నాము అంటూనే అమెరికా యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) పశ్చిమాసియాలో తన సైనిక శక్తిని మోహరిస్తుండటం సర్వత్రా చర్చనీయంశంగా మారింది. తాజాగా అమెరికాకు చెందిన అధునాతన యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ ట్రిపోలి పశ్చిమాసియాకు చేరుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇందులో 2,500 మంది మెరైన్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి రాకతో  ఇక్కడ మోహరించిన మొత్తం అదనపు బలగాల సంఖ్య 3,500 దాటినట్లు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ తన ఎక్స్‌ ద్వారా  వెల్లడించడం గమనార్హం

కాగా, పశ్చిమాసియాలో గడచిన 20 ఏళ్లలో అమెరికా ఇంత భారీ సంఖ్యలో బలగాలను మోహరించడం ఇదే తొలిసారిని పరిశీలకులు అంటున్నారు. అధునాతన ఉభయచర యుద్ధనౌక అయిన ఈ యూఎస్‌ఎస్‌ ట్రిపోలి ఇటీవలి వరకు  జపాన్‌ తీరంలో మోహరించి ఉంది. దాన్ని రెండు వారాల క్రితం అత్యవసరంగా పశ్చిమాసియా (Middle East)కు తరలించాలని  ఆదేశించడంతో అది పశ్చిమాసియాకు చేరింది. దీనిపై ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌లతో సహా అనేక యుద్ధ విమానాలను మోహరించడానికి అవకాశం ఉంది. యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ బాక్సర్‌తో పాటు శాన్‌డియోగా నుంచి వచ్చిన ఇతర నావికా దళ యూనిట్లు, అదనపు బలగాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నాయి.  ఈ దళాలన్ని చేరుకోవడంతో  ఇరాన్‌ (Iran)పై భూతల దాడులకు అగ్రరాజ్యం సిద్ధమైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో యూఎస్‌ బలగాలు పెద్ద ఎత్తున పశ్చిమాసియాకు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇరాన్‌లో యూఎస్ ఏ క్షణాన భూతల దాడులకు దిగే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

వెల్‌కమ్‌ టూ హెల్‌..

కాగా, అమెరికా బలగాలు ఇరాన్‌కు చేరుకోవడంతో  ఇరాన్‌కు చెందిన ఆంగ్ల పత్రిక ‘టెహ్రాన్ టైమ్స్’ వారికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ‘వెల్‌కమ్‌ టూ హెల్‌’ అంటూ ఫ్రంట్‌ పేజ్‌లో ప్రచురించడం సంచలనం రేపింది. ఇరాన్‌ నేలపై అడుగుపెట్టే ఏ యూఎస్‌ సైనికుడైనా.. శవపేటికలోనే తిరిగి వెళ్తాడు అంటూ ఆ పత్రిక వార్నింగ్‌ ఇచ్చింది. 

భూతల యుద్ధం తప్పదా?

ఒకవైపు చర్చలు అంటూనే దాడులు కొనసాగిస్తున్న అమెరికాను ఇరాన్‌ విశ్వసించడం లేదు. గతంలో ఎదురైన అనుభవాలతో శాంతి చర్చలను ఆదేశం అంత సీరియస్‌గా తీసుకోవడం  లేదు. కారణం గతంలో ఇలాగే శాంతి చర్చలు అని చెప్పి దాడులు చేసిన చరిత్ర అమెరికాకు ఉండడమే దానికి కారణం. చర్చల పేరుతో భూతల యుద్ధానికి అమెరికా సన్నద్ధమవుతోందని ఇరాన్‌ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో చర్చలపై దృష్టి సారించడం పక్కన పెట్టి.. అగ్రరాజ్య భూతల దాడులను తిప్పికొట్టే సన్నాహాలకు ప్రాధాన్యం ఇస్తోంది. 

భూతల ఆపరేషన్‌కు ట్రంప్‌ ఆమోదం తెలిపినట్లు ప్రచాం సాగుతోంది. ఇప్పటికే గల్ఫ్‌లో వేలాదిమంది సైనికులను మొహరించింది. 82వ ఎయిర్‌బార్న్‌ డివిజన్‌కు చెందిన 2వేల మంది సైనికులను ఇప్పటికే రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. దీంతో భూతల పోరును ఎదుర్కొనడానికి ఇరాన్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో వియత్నాం, ఇరాక్, అఫ్గానిస్థాన్‌లో అమెరికా సైనిక పోరాట తీరుతెన్నులను క్షుణ్నంగా అధ్యయనం చేసింది. చైనా, రష్యా నుంచి శిక్షణ కూడా పొందింది. తమ అమ్ములపొదిలోని మెరుగైన ఆయుధాలను భూతల పోరు కోసం ఇరాన్‌ దాచి ఉంచిందని సైనిక విశ్లేషకులు భావిస్తున్నారు.  ఒకవేళ భూతల పోరు సాగితే అటు ఇరాన్‌, ఇటు అమెరికాలో తీవ్ర రక్తపాతం తప్పకపోవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు