'పుష్ప 2" ప్రీమియర్ షో చూసేందుకు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబానికి 'పుష్ప2' నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఆర్థికసాయం అందించారు. ఆ సంస్థకు చెందిన నిర్మాత నవీన్ యెర్నేని సోమవారం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మృతురాలి కుటుంబానికి రూ.50లక్షల చెక్కును అందించారు.