ఎన్టీయార్ జిల్లా జగ్గయ్యపేటలో ఓ కారు డ్రైవర్ 7 కిలోల బంగారంతో ఉడాయించాడు. తన యజమాని నగల వ్యాపారి రోడ్డు పక్కన టీ తాగుతుండగా కారుతో సహ పరారయ్యాడు. ఆ తరువాత కారును నందిగామ మునగచెర్ల దగ్గర వదిలి బంగారంతో పారిపోయాడు.
పక్కా ప్లాన్ ప్రకారం...
బీఎన్ఆర్ జ్యుయలరీకి చెందిన నగల వ్యాపారి కిషన్ లాల్ హైదరాబాద్ నుంచి విజయవాడకు ముగ్గురు వ్యక్తులతో బయలుదేరాడు. విజయవాడలో నగలు డెలివరీ ఇవ్వాలి. జగ్గయ్యపేట వరకు వచ్చాక అక్కడ ఆటోనగర్ దగ్గరలో ఓ హోటల్ లో టీ తాగేందుకు ఆగారు. వ్యాపారి కిషన్ లాల్‌తో సహా మిగిలిన ముగ్గురు వ్యక్తులూ టీ తాగేందుకు దిగారు. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ జితేష్ కారుతో ఉడాయించాడు. అది చూసిన కిషన్ గట్టిగా కేకలు వేశారు. కానీ అప్పటికే జితేష్ కారుతో మాయం అయిపోయాడు. వెంటనే వ్యాపారి జగ్గయ్య మండలం చిలకలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆరు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను చేస్తున్నారు. కారులో దాదాపు కిలోల బంగారం ఉంటుందని...దాని విలువ దాదాపు పది కోట్ల వరకు ఉంటుందని నగల వ్యాపారి కిషన్ లాల్ చెప్పారు. జితేష్ కారును మునగచెర్ల దగ్గర వదిలేసి బంగారంతో పారిపోయాడు. సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. బంగారు వ్యాపారి హైదరాబాద్‌లోని డ్రైవర్ ఇంటికి వెళ్లి చూడగా.. అది కూడా ఖాళీ చేసినట్లు తెలిసింది.