/rtv/media/media_files/2025/12/13/fotojet-2025-12-13t083259368-2025-12-13-08-33-34.jpg)
TTD: తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులకు అక్కడ అన్నప్రసాద వితరణ అనేది అనేక సంవత్సరాలుగా అమలు చేస్తున్నారు. అయితే ఇక మీదట అనుబంధ ఆలయాల్లోనూ భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాల వితరణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో 60 అనుబంధ ఆలయాల్లో అన్న ప్రసాదాన్ని ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. వాటిలో 12 వరకు ఆలయాల్లో ఇప్పటికే వితరణ జరుగుతోంది. త్వరలో మిగిలినచోట్లా కూడా ప్రారంభించేందుకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌లు సమీక్ష చేస్తున్నారు. వితరణ, తయారీకి ముందుకువచ్చే ఇస్కాన్ వంటి ధార్మిక సంస్థలు, మఠాల నిర్వాహకులతో అవగాహన ఒప్పందం చేసుకొనే అంశాన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు. వచ్చే మార్చికల్లా అన్ని ఆలయాల్లో అన్న ప్రసాదన వితరణ ప్రారంభించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సూచన మేరకు తిరుమలలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. 1985 ఏప్రిల్ 6న ఈ కార్యక్రమాన్ని ఆయనే ప్రారంభించారు.నాటి నుంచి నిర్విరామంగా కార్యక్రమం కొనసాగుతోంది. అయితే ఇప్పటి నుంచి అనుబంధ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ చేయాలని భావిస్తున్నారు.
1994 ఏప్రిల్ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా ఏర్పడిన అన్న ప్రసాద కార్యక్రమం ఆ తర్వాత శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా మార్చారు. మొదట్లో తిరుమలలోని కల్యాణకట్ట ఎదురుగా ఉన్న పాత అన్నదానం కాంప్లెక్స్‌ను అన్నదానం కోసం వినియోగించేవారు. 2011 జులై 7న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించారు. ఈ అన్నప్రసాదం భవనాన్ని నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రారంభించారు. తిరుమలలో సాధారణ రోజుల్లో 1.80 లక్షల నుంచి 1.90 లక్షలమంది, వారాంతపు రోజుల్లో సుమారు 2.10 లక్షలమంది అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారని ఆలయ అదికారులు తెలిపారు. నవంబరు 15 నాటికి ట్రస్టు నిధులు రూ.2,316 కోట్లకు చేరడంతో పథకం విస్తరణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, మొదటి ప్రాధాన్యంగా దాతల సహకారం తీసుకుంటామని, వీలుకాకపోతే టీటీడీనే సొంతంగా నిర్వహిస్తుందని, అవసరమైన సామగ్రి కొనుగోలు, వంటశాలల నిర్మాణం అంశాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Follow Us