Indiramma indlu: తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల వివరాలు సేకరిస్తోంది. జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాలకోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయనుంది. సర్వే వివరాలపై ప్రతిరోజూ కలెక్టర్లు సమీక్షించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. యాప్‌లో తెలుగు వెర్షన్.. ఈ మేరకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లను అప్రమత్తం చేశారు. డిసెంబరు 6న లాంచ్ చేసిన మొబైల్ యాప్ ద్వారా అర్హులను ఎంచుకోనున్నారు. గ్రామీణులను దృష్టిలో పెట్టుకుని యాప్‌లో తెలుగు వెర్షన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మహిళ పేరు మీదనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, మొత్తం రూ.5 లక్షలు నాలుగు దశల్లో లబ్దిదారులకు చెల్లింపులు చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇక ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని, కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ ఇళ్లు.. ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ పేటెంట్ అని పొంగులేట చెప్పారు. 'తెలంగాణలోని ఏ మూలకు పోయినా, ఏ తండాకు పోయినా, ఏ గ్రామానికో.. ప్రాంతానికి పోయినా ఇందిరమ్మ ఇళ్లే కనబడతాయి. మా ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు ఒక వంతు అయితే, మేం కట్టించే ఇందిరమ్మ ఇళ్లు మరో వంతు. మేం గర్వంగా చెబుతున్నాం. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తాం' అని పొంగులేటి చెప్పారు. ఇది కూడా చదవండి: మంచు ఫ్యామిలీ వివాదాలకు సౌందర్యతో లింక్.. అసలు విషయం తెలిస్తే షాక్! అలాగే స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్‌లు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఏ ఒక్క దరఖాస్తును విడిచిపెట్టకుండా చిన్న చిన్న పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలన్నారు. సర్వే వివరాలపై ప్రతి రోజూ కలెక్టర్‌లు సమీక్షించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాలకోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఓ నిరంతర ప్రక్రియ. ఈ ఏడాది 4.5 లక్షల ఇళ్లను నిర్మించబోతున్నామని తెలిపారు.