TG Elections: డబ్బులు తీసుకుని ఓటెయ్యకపోతే మీకు చుక్కలే.. తెలంగాణ ఎన్నికల్లో కొత్త ట్రెండ్!

తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు అయిపోయాయి. అయినా కూడా అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఎన్నికల్లో తాము పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. మరి కొందరు బెదిరిస్తున్నారు కూడా. 

New Update
TG elections

తెలంగాణలో కొత్త ట్రెండ్ మొదలైంది. ఎన్నికల టైమ్ లో డబ్బులు పంచి పెడతాము. కానీ మేము ఓడిపోతే అవి వెనక్కు తిరిగి ఇచ్చేయాలని అంటున్నారు అభ్యర్థులు. తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికల తర్వాత తెలంగాణ గ్రామాల్లో కనిపిస్తున్న సీన్ ఇది. 

సాధారణంగా ఎన్నికలు అంటే చాలా మందే పోటీ చేస్తారు. కొంత మందే గెలుస్తారు. కానీ అభ్యర్థులు అందరూ సమానంగా ప్రచారం చేస్తారు.  అలాగే గెలవడానికి కూడా శాయశక్తులా ప్రయత్నం చేస్తారు. ఇందులో డబ్బులు కూడా పంచుతారు. అయితే ఎన్నికల అయిపోయాక వాటి గురించి ఆలోచించరు తాము పోగొట్టుకున్న డబ్బును వేరే విధంగా సంపాదించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎక్కడ పోయిందో అక్కడే రాబట్టుకోవాలని అనుకుంటున్నారు తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లోని కొందరు అభ్యర్థులు. పంచాయితీ ఎన్నికల రిజల్ట్ వచ్చాక ఓడిపోయిన అభ్యర్థులు కొందరు తాము పంచిన డబ్బును తిరిగి ఇవ్వాలంటూ మళ్ళీ ఇంటింటికీ వెళ్ళి అడుక్కుంటున్నారు. కన్నీరు మున్నీరు అవుతూ వేడుకుంటున్నారు. 

బాబ్బాబూ నా డబ్బులు ఇచ్చేయండి ప్లీజ్..

నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం ఔరవాణిలో మొదటి విడతలో ఇండిపెండెంట్ అభ్యర్థి బాలరాజు గౌడ్ ఓడిపోయారు. దీంతో ఈయన తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఎన్నికల్లో గెలవడానికి బాలరాజు 10 లక్షలు ఖర్చు చేశారుట. ఇప్పుడు తాను గెలవకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇంటింటికి తిరిగి అడుగుతున్నారు. దేవుడి చిత్రపటం పట్టుకుని మరీ డబ్బులు ఇవ్వాలని వేడుకుంటున్నారు. మరోవైపు బాలరాజు భార్య కూడా ఇదే పని చేస్తున్నారు. అయితే ఆమె ఏకంగా పురుగుల మందు డబ్బే చేతిలో పట్టుకుని మరీ బెదిరిస్తూ అడుగుతున్నారు. ఓట్లు వేశామంటూ దేవుడిపై పలువురు ప్రమాణం చేశారు. అందరూ ఓట్లు వేశారు మరి తాను ఎలా ఓడిపోయానంటూ అభ్యర్థి బాలరాజు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.

ఇస్తారా..చావాలా..

వీరిలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమ్యానాయక్ కూడా మహబూబాబాద్ మండల్ సోమ్లా గ్రామంలో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతున్నారని తెలుస్తోంది. తన మరదలు భూక్యా కౌసల్య గెలుపు కోసం ఖర్చు పెట్టినదంతా తిరిగి ఇచ్చేయాలని గ్రామస్తులను డిమాండ్ చేస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాలోని హరితా తండాలో అయితే మరీ ఘోరం..అక్కడి ఇండిపెండెంట్ అభ్యర్థి మాలోత్ రంగా అయితే ఏకంగా సెల్ టవర్ ఎక్కి మరీ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని బెదిరించారు. తన డబ్బులు ఇవ్వకపోతే టవర్ నుంచి దూకేస్తానంటూ హల్ చల్ చేశారు. దీంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. చివరకు పోలీసులు, కుటుంబ సభ్యులు కలిపి ఆయన్ను కిందకు దించారు. 

Advertisment
తాజా కథనాలు