ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ కేసులో ప్రధాన నిందుతుడిగా ఆరోపణలు ఎదురుకుంటున్న కేటీఆర్ 2025 జనవరి 06వ తేదీన ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 : 30 గంటలకు తమ ముందు హాజరు కావాలంటూ ఆయనకు జనవరి 03వ తేదీనే అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణలో కేటీఆర్ కు ఎలాంటి ప్రశ్నలు సంధించాలో అధికారులు ప్రశ్నావళిని సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటిరవరకు ఈ కేసుకు సంబంధించి ఏసీబీ పలు డాక్యుమెంట్లు, ఆధారాలను సేకరించింది. వీటి ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించనుంది. బ్రిటన్ కు చెందిన రేసింగ్ నిర్వహణ సంస్థకు రూ.45.71కోట్ల నిధులను నిబంధనలకు విరుద్ధంగా చెల్లించినట్లు కేటీఆర్ పై అభియోగాలున్నాయి. దీనిపై గతేడాది డిసెంబర్ 19వ తేదీన ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్ ను A1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను A2గా , హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని A3గా చేర్చింది. రేపు ఈడీ విచారణకు ఇప్పటికే ఈ కేసులో 2025 జనవరి 07వ తేదీన విచారణకు రావాలంటూ ఈడీ సైతం కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేపట్టింది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టుగా గుర్తించిన ఈడీ కేసును దర్యాప్తు చేపట్టింది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలు మాత్రం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. డుమ్మా కొట్టారు. దీంతో ఈడీ వీరికి విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. 08వ తేదీన బీఎల్‌ఎన్ రెడ్డి, 09వ తేదీన అరవింద్ కుమార్‌ను హాజరు కావాలని ఆదేశించింది. మరి ఈ సారైనా హాజరు అవుతారో లేదో చూడాలి. Also Read : నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే!