లేటు వయసులో పెళ్లి, రెండో పెళ్లి చేసుకునే బడాబాబులను టార్గెట్ చేస్తూ డేటింగ్ యాప్‌లలో యువతుల్లా నటిస్తూ హనీట్రాప్ చేస్తున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు. అందమైన ఫొటోలతో వల వేస్తూ కోట్లు కొట్టేస్తున్నారు. మ్యాట్రిమోనీ, డేటింగ్ యాప్‌లను ఆధారంగా చేసుకుని ఫేక్ ఫోటోలు పెట్టి బడాబాబులతో పరిచయం పెంచుకుంటారు. ఆ తరువాత ఫ్రెండ్షిప్ చేసి దగ్గరవుతారు. వ్యక్తిగత వివరాలు తెలుసుకుని ఇటీవల తాము స్టాక్ ట్రేడింగ్, బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టి బాగా సంపాదించినట్లు చెబుతారు. ఈసారి ఇద్దరు కలిసి పెట్టుబడులు పెట్టి సంపాదిస్తే భవిష్యత్తులో బాగా సంపాదించి సెటిల్ కావచ్చు అంటూ నమ్మిస్తారు. వాళ్లు చెప్పిన వెబ్‌సైట్లలో రిజిస్టర్ చేయించి పెట్టిన ప్రతిసారీ దానికి లాభాలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపిస్తారు. అయితే వాటిని విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు. బాధితులు డబ్బులు పంపడం ఆపేస్తే ఇక కనిపించరు. ఫేక్ వెబ్‌సైట్లో రిజిస్టర్ ఇటీవల మాదాపూర్ లో ఓ 46 ఏళ్ల సాప్ట్ వేర్ ఉద్యోగి.. పెళ్లి కోసం మ్యాట్రిమోనీలో ఖాతా తెరిచాడు. అతనికి మీనాక్షి అనే యువతి పరిచయం అయింది. పరిచయం పెంచుకుని కొన్ని రోజులు మాట్లాడింది. ఆ తరువాత తాను క్రిప్టో ట్రేడింగ్‌లో బాగా డబ్బు సంపాదించినట్లు నమ్మించి అతన్ని కూడా ట్రేడింగ్‌కు సిద్ధమయ్యేలా ప్రిపేర్ చేసింది. అతన్ని ఫేక్ వెబ్‌సైట్లో రిజిస్టర్ చేయించింది. ఇలా దశలవారీగా అతను రూ.94 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఇందులో ఐదురెట్లు లాభం వచ్చినట్లుగా చూపించింది. అయితే విత్‌డ్రా చేసుకోడానికి వీలులేకపోవడంతో బాధితుడు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్ కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి సోషల్ మీడియాలో ఓ మహిళ పరిచయమైంది. పరిచయం పెంచుకుని అతని నుంచి అన్ని వివరాలు సేకరించింది. ఫారెక్స్ ట్రేడింగ్ చేసి సంపాదించినట్లు నమ్మించి అతని చేత ఫేక్ వెబ్‌సైట్‌లో రూ.1.89 కోట్లు పెట్టుబడులు పెట్టించింది. లాభాల మాట దేవుడెరుగు... పెట్టిన డబ్బులు అసలు వెనక్కి తీసుకోడానికి ప్రయత్నించినా కుదరలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. గతేడాది హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. పోలీసులు వెల్లడించిన డాటా ప్రకారం.. హైదరాబాద్‌లో 12 ,సైబరాబాద్ లో 53, రాచకొండలో 40పైగా ఇలాంటి కేసులు అయ్యాయి. Also Read : కేటీఆర్ క్వాష్ పిటిషన్ : హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ