/rtv/media/media_files/2025/01/27/1lNE3cgfnHre8pc25Os9.jpg)
Rythu Bharosa
Rythu Bharosa : గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న రైతుభరోసా పంట పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది, ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం మరో కీలక సమాచారం కూడా ఇచ్చింది. ఇప్పటివరకు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోనివారు లేదా కొత్తగా భూమి పట్టా పొందిన వారు రైతుభరోసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
అన్ని అర్హతలు ఉండి రైతు భరోసా పొందని వారు, కొత్తగా పట్టా పొందిన రైతులు అంటే 28.02.2026 లోపు పట్టా పొందిన రైతులు కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీనికోసం స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి దరఖాస్తులను సమర్పించాలని సూచించింది. అంటే కొత్తగా వ్యవసాయ భూములకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకం నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం అర్హులైన వారు మార్చి 21వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించింది.
దీనికోసం రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఇవ్వాలి, అలాగే రైతు ఆధార్ కార్డుతో పాటు రైతు భరోసా అప్లికేషన్ ఫారం నింపి అధికారులకు ఇవ్వాలి. సంబంధిత అప్లికేషన్ ఫారంలో పూర్తి వివరాలు నింపి రైతు వేదికల వద్ద లేదా మండలాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలని ప్రభుత్వం సూచించింది. అలాంటి వారి వివరాలు వెంటనే నమోదు చేసి వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని ఏఈవోలు, వ్యవసాయాధికారులను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
కాగా రైతుల నుంచి వ్యతిరేకత, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నెల 22 నుంచి రైతుభరోసా ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించి డబ్బులను సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి సీఎం రేవంత్ రిలీజ్ చేస్తారు. తాజాగా కొత్తగా పట్టా పొందిన వారు కూడా దరఖాస్తు చేసుకుంటే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
Follow Us