Panchayat Elections : చివరిదాకా ఉత్కంఠ..విజయతీరాలకు చేర్చిన ఒక్క ఓటు

రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగియగా.. ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. క్రికెట్‌లో ఒక్క పరుగు తేడాతో గెలుపు ఓటములు తారుమారు అయినట్లు తెలంగాణలో తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఆ ఒక్క ఓటు విలువను మరోసారి స్పష్టం చేశాయి.

New Update
FotoJet - 2025-12-12T112916.590

Excitement till the end..one vote that brought us to the shores of victory

Panchayat Elections : తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగియగా.. ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. ఫలితాలు పలుచోట్ల అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్‌ను తలపించాయి.  క్రికెట్‌లో ఒక్క పరుగు తేడాతో గెలుపు ఓటములు తారుమారు అయిన సందర్భాలు అనేకం. అలాంటిదే ప్రజాస్వామ్యంలో కూడా ఒక్క ఓటు అంతే శక్తిమంతమైనది. మనం వేసే ఆ ఒక్క ఓటే.. ఒక ప్రతినిధి భవిష్యత్తును.. తద్వారా ఆ ప్రాంత అభివృద్ధిని నిర్ణయించగలదు. తెలంగాణలో తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఆ ఒక్క ఓటు విలువను మరోసారి స్పష్టం చేశాయి.

దిశ మార్చిన ఒక్క ఓటు

ఒక్క ఓటుతో ఏమవుతుందిలే. అనుకుంటే తప్పులో కాలేసినట్లే...తెలంగాణ తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, ఒక్క ఓటు ఎందరో అభ్యర్థుల తలరాతను మార్చేసింది. గెలుపోటముల మధ్య సరిగ్గా ఒక్క ఓటే నిలిచి, అభ్యర్థులను ఉత్కంఠపు అంచున నిలబెట్టింది. ఓటమి అంచున నిలబడిన వారిని అదృష్టం వరించి, గెలుపు తీరాలకు చేర్చింది. కొన్నిచోట్ల చెల్లని ఓటు కొంప ముంచితే, మరికొన్నిచోట్ల టాస్ విజేతను నిర్ణయించింది. ఇలాంటి కథనాలెన్నో ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది.

కుమురం భీం జిల్లా కెరమెరి మండలం, పరందొలి గ్రామంలో రాథోడ్ పుష్పలత, తన సమీప ప్రత్యర్థి దిలీప్‌పై కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. పుష్పలతకు 102 ఓట్లు రాగా, దిలీప్‌కు 101 ఓట్లు వచ్చాయి. అలాగే కామారెడ్డి జిల్లా  రాజంపేట మండలం, నడిమి తండాలో బానోత్ లక్ష్మి, తన సమీప ప్రత్యర్థి సునీతపై ఒక్క ఓటు ఆధిక్యంతో విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా  బోధన్ మండలం, కల్దుర్కిలో ఏకంగా మూడుసార్లు ఓట్లు లెక్కించాల్సి వచ్చింది. ప్రతిసారీ ఫలితం మారుతూ, చివరికి నరేందర్ రెడ్డి ఒక్క ఓటు తేడాతో శ్రీనివాస్‌పై గెలుపొందారు. జనగామ జిల్లా  రఘునాథపల్లి మండలం, ఎల్లారెడ్డిగూడెంలో కథ మరింత ఆసక్తికరంగా మారింది. లెక్కింపులో జోజికి 211, నర్సయ్యకు 210 ఓట్లు వచ్చాయి. అయితే, రీకౌంటింగ్‌లో జోజికి పడిన ఓట్లలో ఒకటి చెల్లనిదిగా తేలడంతో, ఇద్దరికీ 210 ఓట్లు సమానమయ్యాయి. చివరికి, టాస్ వేసి విజేతగా జోజిని ప్రకటించారు.

నిజామాబాద్‌ జిల్లా కల్దుర్కిలో న్యాలం శ్రీనివాస్‌.. కామారెడ్డి జిల్లా నడిమితండాలో లక్ష్మి షేర్‌సింగ్‌, సోమరిపేట తండాలో సునీత సత్యవతి.. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం జైత్రం తండాలో రాథోడ్‌ పరశురాం తదితరులు ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించారు.మెదక్ జిల్లా, రేగోడ్ మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బేగరి పాండరి ఒక్క ఓటుతో సర్పంచ్‌గా విజయం సాధించారు. గ్రామంలో మొత్తం 620 ఓట్లు ఉండగా 585 ఓట్లు పోలయ్యాయి. అందులో 9 ఓట్లు చెల్లలేదు. ఒక ఓటు నోటాకు పడింది. బేగరి పాండరికి 288 ఓట్లురాగా, అతని సమీప ప్రత్యర్థి BRS పార్టీ మద్దతుతో పోటీ చేసిన హరిజన సత్తయాకు 287 ఓట్లు వచ్చాయి

 నిర్మల్ జిల్లా, కడెం మండలం, కల్లెడలో తాటి రుక్మిణీ దేవి ఒక్క ఓటుతో గెలిచారు. అయితే, ఓడిపోయిన లక్ష్మికి పడిన ఓట్లలో ఒకటి చెల్లనిదిగా అధికారులు ప్రకటించడంతో, ఆమె వర్గీయులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. అధికారులు మళ్లీ పరిశీలించి, ఆ ఓటు చెల్లనిదేనని నిర్ధారించడంతో, రుక్మిణీ దేవి విజయాన్ని ఖరారు చేశారు.నల్గొండలో మద్దిరాల మండలం తూర్పు తండాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భూక్య వీరన్న ప్రత్యర్థిపై ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఒక్క ఓటుతో సర్పంచ్ అభ్యర్థి గెలుపొందడం చర్చనీయాంశంగా మారింది. దీంతో రీకౌంటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం దామరవంచ సర్పంచ్ ఎన్నికల ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపింది. మొదట బీఆర్ఎస్ అభ్యర్థి స్వాతి 3 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించినా, రీకౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సుజాత కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ ఫలితం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఒక్క ఓటు విలువేమిటో : ఈ ఫలితాలు, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంత విలువైందో మరోసారి నిరూపించాయి. జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లోనూ అనేక మంది అభ్యర్థులు ఒకటి, రెండు ఓట్ల స్వల్ప తేడాతోనే సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు. ఒక్క ఓటుతో ఓడిపోయిన వారు నిరాశతో వెనుదిరుగుతుంటే, అదృష్టం వరించిన వారు సంబరాల్లో మునిగిపోయారు.

నాలుగు ఓట్ల తేడాతో గెలుపు

హన్మకొండ జిల్లా ఆరేపల్లిలో సర్పంచ్‌ అభ్యర్థి పి. స్రవంతి కేవలం 4 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. అదేవిధంగా.. కామారెడ్డి జిల్లా ర్యాగట్లపల్లిలో భాగ్యమ్మ అనే అభ్యర్థి 5 ఓట్ల తేడాతో గెలుపొందారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం, చీన్యా తండాలో బీఆర్‌ఎస్ బలపరిచిన జాటోత్ హరిచంద్.. కేవలం 9 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. జగిత్యాల జిల్లా , తిమ్మాపూర్‌లో బీఆర్‌ఎస్ బలపరిచిన మెగావత్ లత.. కేవలం 12 ఓట్ల తేడాతో విజయం సాధించారు.  

టాస్ విజేతలు

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్ల సర్పంచ్‌ పదవికోసం కాంగ్రెస్‌కు చెందిన నేతలు మరాటి రాజ్‌కుమార్‌, గోపు రాము పోటీపడ్డారు. ఇద్దరికీ 212 ఓట్ల చొప్పున పోలయ్యాయి. దీనితో రిటర్నింగ్‌ అధికారి టాస్‌ వేయగా.. మరాటి రాజ్‌కుమార్‌ను విజయం వరించింది. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం దాబా(బి)లో టాస్‌ ద్వారా నర్వాటె ఈశ్వర్‌ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం లక్ష్మక్కపల్లిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారులు లక్కీడ్రా నిర్వహించగా.. బీఆర్‌ఎస్‌ మద్దతుదారు ఇండ్ల రాజయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

Advertisment
తాజా కథనాలు