/rtv/media/media_files/2025/12/11/3953emb5lhaa7eplefruroi90txafgtt-2025-12-11-20-01-53.jpg)
Panchayat Elections : తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడత పూర్తయింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. మెజారిటీ సర్పంచ్ స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకుంది. తొలివిడతకు సంబంధించి మొత్తం 4,236 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా గురువారం 3,836 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల మేరకు ఏకగ్రీవాలతో కలుపుకొని అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2,383 స్థానాల్లో విజయం సాధించగా, పలు చోట్ల గట్టిపోటీ ఇచ్చిన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి 1,155 పంచాయతీలను గెలు పొందిం ది. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సీపీఎం 14, సీపీఐ 16 చోట్లకు పైగా గెలిచాయి.
రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఎన్నికలు జరగగా 30 జిల్లాల్లో అధికార పార్టీ తన ఆధిపత్యం ప్రదర్శించింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్‌ఎస్ కొంత మేరకు తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇక బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. తొలి విడత ఎన్నికల్లో మొత్తంగా ఆ పార్టీకి 186 సర్పంచ్ స్థానాలు మాత్రమే దక్కాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 24 పంచాయతీల్లో కమలం పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఐదు జిల్లాల్లో ఆ పార్టీ కనీంస తన ప్రభావం చూపలేకపోయింది. కేవలం 4.6 శాతం స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది. మొత్తంగా కాంగ్రెస్ 58.5 శాతం గెలుపొందగా, బీఆర్‌ఎస్ 26 శాతం సీట్లను గెలిచింది.
సిద్దిపేటలో కారు పరుగు..
సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్‌ఎస్ పైచేయి సాధించింది. ఈ జిల్లాలో తొలి విడతలో 163 పంచాయతీలకుగాను 16 ఏకగ్రీవం కాగా, బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు 75 సర్పంచ్ సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ మద్దతిచ్చిన వారు 60 అభ్యర్థులు విజయం సాధించారు. ఈ జిల్లాలో బీజేపీకి 11 స్థానాలు దక్కగా, ఇతరులు 17 స్థానాలను దక్కించుకున్నారు. ఇక బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌ది పైచేయి అయింది. ఆ జిల్లాలో 42 చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తే 30 చోట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇక తొలి విడతలో 395 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవం కాగా, వీటిలో 90 శాతానికి పైగా కాంగ్రెస్‌కే దక్కాయి. తొలివిడత ఎన్నికల్లో 84.28 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88 శాతం పోలింగ్ జరగ్గా... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79 శాతం ఓట్లు పోలయ్యాయి.
కొనసాగిన కాంగ్రెస్ హవా
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ దాదాపుగా అన్ని జిల్లాల్లో తిరిగి అదే ఆధిపత్యాన్ని సాధించింది. 10 జిల్లాల్లో సగానికి పైగా సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. అందులో ముందు వరుసలో ఖమ్మం జిల్లా ఉంది. ఈ జిల్లాలో తొలి విడత 192 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగగా.. 135 సీట్లు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన వారే దక్కించుకున్నారు. బీఆర్‌ఎస్ 33, ఇతరులు మిగిలినవి గెలుచుకున్నారు. ఖమ్మంతోపాటు నల్లగొండ, భూపాలపల్లి, జనగామ, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో సగానికిపైగా పంచాయతీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
వెల్లువెత్తిన చైతన్యం
సర్పంచ్ ఎన్నికల్లో చైతన్యం వెల్లువెత్తింది. గ్రామీణ ప్రజలు ఒటేయ్యడానికి ఉదయం నుంచే బారులు తీరారు. అందులోనూ ఆడవారు అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం 53,57,277 మంది ఓటర్లకి గాను 45,15,141 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో అత్యధికంగా మహిళలు 23,15,796 మంది ఓటు వేయగా.. పురుషులు 21,99,267, ఇతరులు 78 మంది పోలింగ్‌లో పాల్గొనడం విశేషం. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లా్ల్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడం విశేషం. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియగా. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. చాలా చోట్ల ఒకటి, రెండు, మూడు ఓట్ల తేడా ఉండడంతో పలు దఫాలు రీకౌంటింగ్ చేయాల్సి వచ్చింది.
Follow Us