తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. ఏడాది పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్.. నిఘావర్గాలు, సునీల్ కనుగోలు టీమ్‌తో కలిసి సర్వే తెప్పించుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ సర్వేలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రేవంత్ కేబినెట్ లోని ఇద్దరు మంత్రులపై జనాలు తీవ్ర అసంతృప్తిలోఉన్నారని రిపోర్టులో వెల్లడైనట్లుగా తెలుస్తోంది. అయితే వారిని సీఎం స్వయంగా పిలిచి మాట్లాడుతారా లేకా కేబినేట్ నుంచి తొలిగిస్తారా అన్నది ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని రిపోర్టులో వెల్లడైనట్లుగా పోలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలపైనే ఎక్కువగా ప్రజా వ్యతిరేకత ఉన్నట్లుగా సర్వేలో వెల్లడైందట. ఈ సర్వేలను త్వరలో ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్‌లో సీఎం రేవంత్ పంపించనున్నారట. దీంతో సర్వే నివేదికల్లో ఏముందన్న టెన్షన్ ఎమ్మెల్యేల్లో నెలకొంది. Also Read : బీసీలకు న్యాయం చేయాల్సిందే.. రేవంత్ కు కవిత వార్నింగ్! ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఇటీవల సీఎం ఇంటికి వెళ్లిన కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ క్లాస్ తీసుకున్నారు. కొత్తగా ఎన్నికైన కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహం చూపిస్తున్నారని, అతి చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వర్గ విభేదాలు పక్కన పెట్టాలని.. కార్యకర్తలకు సమయం ఇవ్వాలంటూ సూచించారు సీఎం. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలందరి రిపోర్టులు తన దగ్గర ఉన్నాయని.. నేను మారాను మీరు కూడా మారండి అంటూ సీఎం వారికి చెప్పారు. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం వారికి సూచించారు. నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళదామని పార్టీ నేతలతో సీఎం చెప్పుకొచ్చారు. సీఎం దావోస్ పర్యటన ఇదిలాఉండగా.. సీఎం రేవంత్ బృందం జనవరి 21 నుంచి 23వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. దావోస్‌లో 20 నుంచి 24వ తేదీ వరకు అంటే ఐదు రోజుల పాటు 'ప్రపంచ ఆర్థిక వేదిక' వార్షిక సదస్సు జరగనుంది. ఈ సదస్సులో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.