సకల హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను 2025 జనవరి 06వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచి మోదీ దీనిని వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, వి.సోమన్న, రవనీత్ సింగ్, బండి సంజయ్ లు హాజరు కానున్నారు. వీరితో పాటుగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దాదాపు రూ.413కోట్ల వ్యయంతో ఈ రైల్వే టెర్మినల్ ను అధునాతనంగా నిర్మించారు. సికింద్రబాద్ కు బదులుగా ఇకపై చాలా రైళ్లు ఇక్కడే హోల్డింగ్ తీసుకుంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ టెర్మినల్ ను నిర్మించగా.. ఇక్కడినుంచి 24 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రూ. 32వేల కోట్లు ఖర్చు చేసి 40 రైల్వే స్టేషన్లు, లైన్లను డెవలప్ చేయగా.. అందులో చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఒకటి. జనవరి 7 నుంచి సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ (12757-12758), గుంటూరు- సికింద్రాబాద్- గుంటూర్ ఎక్స్‌ప్రెస్ (17201-17202), సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్(17233-17234) రైళ్లకు చర్లపల్లిలో అదనపు స్టాపేజ్ ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లి వచ్చే రైళ్లు (12603-12604) మార్చి 7 నుంచి,. గోరఖ్‌పూర్- సికింద్రాబాద్ వెళ్లి వచ్చే రైళ్లు (12589-12590) మార్చి 12 నుంచి చర్లపల్లి టెర్మినల్ నుంచే రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. సంక్రాంతికి 30 రైళ్లు సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని దక్షిణమధ్య రైల్వే 52 స్పెషల్ ట్రెయిన్స్ నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ రైళ్లలో దాదాపుగా 30 రైళ్లను చర్లపల్లి నుంచి నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 2025 జనవరి 17 వరకు రైళ్ల రాకపోకలు జరగనున్నాయి. ఇక్కడికి చేరుకోవడానికి సికింద్రాబాద్ బస్ స్టేషన్ నుంచి ప్రతి 10 నిమిషాలకో బస్సు (250సీ) ఉంటుంది. రైళ్ల రాకపోకలకు దృష్టిలో పెట్టుకుని చర్లపల్లికి మరిన్ని బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తుంది. Also Read : మంచు తుఫానులో అమెరికా..ఎమర్జెన్సీ ప్రకటించిన రాష్ట్రాలు