కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్. ఎన్నికలప్పుడు రూ. 15 వేల రైతు భరోసా నిధులు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ. 12 వేలు ఇస్తామని ప్రకటించడం దారుణమన్నారు. ఇది రైతులను నయవంచనకు గురిచేయడమేనని అన్నారు. హైదరాబాద్ లో బీజేపీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. దాదాపుగా 70 లక్షల మంది రైతులు కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే ఏడాది పాటు రైతు భరోసా ఇవ్వలేదన్నారు. ఒక్కో రైతుకు కాంగ్రెస్ ఇప్పటివరకు రూ. 18 వే-లు బాకీ ఉందన్నారు. జనవరి 26 లోపు ఈ నిధులు రైతుల అకౌంట్లో వేయాలని ప్రభుత్వాన్ని సంజయ్ డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ సర్కార్ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు బండి సంజయ్. ఈ ఆరు గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏడాది పాటు టైమ్ పాస్ పాలన కొనసాగించిందన్నారు. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ కు కేసీఆర్ గురువుని బండి సంజయ్ విమర్శించారు. లోకల్ బాడీ ఎలక్షన్ కోసమే రైతు భరోసా, కొత్త రేషన్ కార్టులంటూ కాంగ్రెస్ కొత్త రకం మోసానికి దిగిందని.. ప్రజలు మళ్లీ మోసపోవద్దని సూచించారు. ఎలక్షన్స్ అయిపోయాక రైతు భరోసాకు భరోసానే లేదన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు సంజయ్. రూ. 500 బోనస్ బోగసే అయిందని... 20 శాతం రైతులకు కూడా బోనస్ అందలేదని చెప్పుకొచ్చారు బండి సంజయ్. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను కూడా కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్దారు. మహిళలకు ఇస్తామన్న రూ. 2500 ఏమైందని ప్రశ్నించారు. ఏడాదిలోనే రూ. 70 వేల కోట్ల అప్పు తెచ్చారని, ఇంకో రూ, 30 వేల కోట్ల అప్పు కోసం ప్రయత్నిస్తుందని చెప్పారు. పాలనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. ఓడిపోయాక కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమయ్యారని.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా బయటకు రాని నేత ప్రజలకు అవసరమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.