Brickets Stoves : గ్యాస్ కష్టాలకు చెక్...ప్రత్యామ్నాయంగా బ్రికెట్స్‌ స్టవ్‌

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా గ్యాస్‌ కష్టాలను తెచ్చిపెట్టింది. దీంతో పలు హోటల్స్ మూతపడ్డాయి. దీంతో మార్కెట్లో బయో డీగ్రేడబుల్‌ వ్యర్థాలతో తయారు చేసిన ఇందనంతో కూడిన బ్రికెట్స్‌ ను వినియోగించే స్టవ్ ల పట్ల పలువురు ఆసక్తి చూపుతున్నారు.

New Update
FotoJet (23)

Brickets Stoves

Brickets Stoves :  పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా గ్యాస్‌ కష్టాలను తెచ్చిపెట్టింది. ఇరాన్ ,ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ముఖ్యంగా మనదేశంలో గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో కమర్షియల్‌ గ్యాస్ దొరకక పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లు,ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, ఆటోలు, హాస్టళ్లు ఇలా ఒక్కటని కాదు అన్ని రంగాలకు గ్యాస్‌ కష్టాలు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా గ్యాస్‌ ఇబ్బందుల మూలంగా పలు హోటల్స్ . హాస్టళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. మరోవైపు గ్యాస్ బుకింగ్‌ కోసం ఎజేన్సీల వద్ద పెద్ద ఎత్తున హోటల్స్ యజమానులు క్యూ కడుతున్నారు. అయినా వారికి గ్యాస్‌ దొరుకుతుందన్న నమ్మకం కుదరడం లేదు.
  
ఇక కొన్ని హోటల్స్‌, రెస్టారెంట్ల వారు గ్యాస్‌ కష్టాలను ఎదుర్కొవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే పలువురు కట్టెల పొయ్యిలు ఉపయోగించి వంటలు చేస్తుండగా మరికొంతమంది బట్టీలు, ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో వినియోగడారులకు మరో కొత్తరకం స్టౌ అందుబాటులోకి వచ్చింది. నిజానికి ఇది ఇదివరకే ఉన్నప్పటికీ గతంలో వినియోగించే వారు తక్కువగా ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ ఇది ఒక అవసరంగా మారింది. అదే బ్రికెట్స్ స్టవ్‌. బ్రికెట్స్‌(బయో డీగ్రేడబుల్‌ వ్యర్థాలతో తయారు చేసిన ఇందనం) వినియోగించి దీన్ని వంటలు చేయడానికి ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ స్టవ్‌లు హైదరాబాద్‌లో విరివిగా దొరుకుతున్నాయి. దీంతో హోటల్స్‌, రెస్టారెంట్ల యజమానులు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా హైదరాబాద్‌ నగరం శివారు ప్రాంతాలైన మేడ్చెల్‌, పటాన్‌చెరువు, శంషాబాద్‌, దండుమల్కాపూర్‌ తదితర పారిశామ్రిక వాడల్లో ఈ స్టవ్‌లు తయారు చేస్తున్నారు.  ఈ తరహా స్టవ్‌లు తయారు చేసే పరిశ్రమలు 30కి పైగా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ పరిశ్రమలు  రోజుకు 2వేల టన్నుల బయోమాస్‌ బ్రికెట్స్‌ను తయారు చేసి విక్రయించేవి. అయితే గ్యాస్‌ కొరత కారణంగా ఇప్పుడు 4 వేల టన్నుల వరకు బ్రికెట్స్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయా పరిశ్రమల నిర్వహకులు చెబుతున్నారు.

కాగా ఈ బ్రికెట్స్‌ తయారు చేయడానికి రోడ్ల పక్కన ఎండిపోయిన చెట్ల కొమ్మలు, ఆకులు, తాగి పడేసిన కొబ్బరి బొండాలు, ఊక పొట్టు, పల్లి పొట్టు, ఎండిపోయిన కంది, సోయాబీన్‌, ఆయుర్వేద మొక్కల వ్యర్థాలు, తిని పడేసిన మొక్కజొన్న కంకులు ఇలా అన్ని రకాల వ్యర్థాలను సేకరిస్తారు. అనంతరం వీటిని పొట్టుగా మార్చి ఆ తర్వాత చిన్న మిషన్‌లో గట్టిగా కుదించి వివిధ సైజుల్లో బ్రికెట్స్‌గా తయారు చేస్తారు. మామూలు రోజుల్లో కిలో బ్రికెట్స్‌ ధర రూ.10లు పలుకుతుంది. అయితే ప్రస్తుతం గ్యాస్‌  కొరత మూలంగా ఉత్పత్తిదారులు వీటిని కిలో రూ.12-16కు పెంచారు. అలాగే వీటిని వినియోగించేందుకు పారిశ్రామిక వాడల్లో ప్రత్యేకంగా స్టవ్‌లను తయారు చేస్తున్నారు. గృహవసరాలకు, కమర్షియల్‌ అవసరాలకు వేర్వేరుగా ఈ స్టవ్‌లు తయారు చేసి విక్రయిస్తున్నారు. మనదేశంలో కంటే వీటి వినియోగం  భూటాన్‌, నేపాల్‌, బర్మా, టాంజానియా, వంటి దేశాల్లో ఎక్కువగా ఉంది.  మనం ఉపయోగించే కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌19కేజీలు ఉంటుంది. ఇది 60 కిలోల బ్రికెట్స్‌కు సమానం. కమర్షియల్‌ గ్యాస్‌ ధర ఇపుడు రూ.2 వేలకు పై మాటే. అదే బ్రికెట్స్‌ స్టవ్‌ వల్ల రూ.600 నుంచి రూ.800 వరకు మాత్రమే ఖర్చవుతుంది.
 
కాగా బ్రికెట్స్‌ స్టవ్‌లకు ఆధరణ పెరగడంతో బాలానగర్‌కు చెందిన శ్రీ ఇంజనీరింగ్‌ సంస్థ ప్రత్యేకంగా జ్వాల పేరుతో స్టవ్‌లను తయారు చేస్తోంది. వీరు  9, 12, 16 అంగుళాల వెడల్పు గల బర్నర్లతో తయారుచేసిన పొయ్యిలను రూ.19 నుంచి 36 వేల వరకు అమ్ముతున్నారు. ఈ జ్వాల స్టవ్‌లతో 4 నుంచి 12 కేజీల బ్రికెట్స్‌ను వినియోగించి 100కిలోల వరకు ఆహారపదార్థాలు వండే అవకాశం ఉంది.   దీంతో హోటల్స్‌, రెస్టారెంట్ల యాజమానులు ఈ స్టవ్‌లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండటంతో ఆ సంస్థ అధనంగా స్టవ్‌లను తయారు చేయడానికి సిద్ధమైంది.

Advertisment
తాజా కథనాలు