/rtv/media/media_files/2026/03/10/jasprit-bumrah-2026-03-10-21-30-13.jpg)
టీ20 ప్రపంచకప్ 2026లో తన అద్భుత ప్రదర్శనతో భారత్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. ఈ టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి, ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 4/15 గణాంకాలతో అదరగొట్టిన బుమ్రా, బీసీసీఐ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఏడాదికి రూ. 2 కోట్ల ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. గతంలో 'A+' కేటగిరీలో ఉండి రూ. 7 కోట్ల పారితోషికం అందుకున్న బుమ్రాను, ఈ ఏడాది బోర్డు 'A' కేటగిరీకి తగ్గించింది.
నిజానికి ఇందులో బుమ్రా తప్పేమీ లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు అంతర్జాతీయ టీ20లు, టెస్టుల నుంచి రిటైర్ అవ్వడం, రవీంద్ర జడేజా కూడా టీ20లకు వీడ్కోలు పలకడంతో 'A+' కేటగిరీలో కేవలం బుమ్రా మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలో అసలు 'A+' కేటగిరీనే రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనివల్ల మూడు ఫార్మాట్లలో నిలకడగా ఆడుతున్న బుమ్రా ఆదాయం రూ. 7 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు పడిపోనుంది. అయితే, బుమ్రా వంటి కీలక ఆటగాడికి ఇలా ఫీజు తగ్గించడం అన్యాయమని భావిస్తున్న బోర్డు, అతనికి ఎలా నష్టపరిహారం అందించాలనే అంశంపై ప్రస్తుతం కసరత్తు చేస్తోంది.
అక్షర్ పటేల్ పరిస్థితి కూడా
బుమ్రా మాత్రమే కాదు, టీ20 వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ పరిస్థితి కూడా చర్చనీయాంశంగా మారింది. జడేజా రిటైర్మెంట్ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలక ఆటగాడిగా మారిన అక్షర్‌కు కేవలం గ్రేడ్ 'C' (రూ. 1 కోటి) కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. అలాగే కేఎల్ రాహుల్, సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ వంటి స్టార్లను కూడా గ్రేడ్ 'A' నుంచి 'B'కి తగ్గించారు. దీనివల్ల వీరంతా కూడా సుమారు రూ. 2 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉంది.
జస్ప్రీత్ బుమ్రా నికర ఆస్తుల విలువ సుమారు రూ. 75 కోట్లు కాగా, ఐపీఎల్ 2026 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ అతన్ని రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా బుమ్రా పనిభారాన్ని మేనేజ్ చేస్తూ, అతన్ని మరిన్ని వన్డేల్లో ఆడించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఏది ఏమైనా, నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకు నష్టం కలగకుండా కాంట్రాక్ట్ విలువలపై బోర్డు త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
Follow Us