Israel : వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. వెతికి మరీ వేటాడతాం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన!

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ రక్షణ దళం ఆ దేశ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి నేరుగా హెచ్చరికలు జారీ చేసింది.

New Update
iran

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ రక్షణ దళం ఆ దేశ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి నేరుగా హెచ్చరికలు జారీ చేసింది. "అతను ఎక్కడున్నా సరే.. మేం వెతికి పట్టుకుంటాం" అని ఐడిఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో ఇరాన్ కీలక భద్రతా అధికారులు అలీ లారిజానీ, బాసిజ్ ఫోర్స్ కమాండర్ జనరల్ గులామ్రేజా సులేమానీ మరణించినట్లు ధృవీకరించిన కొద్ది గంటల్లోనే ఈ ప్రకటన రావడం గమనార్హం.

మొజ్తబా ఖమేనీ ఆచూకీ గురించి ప్రస్తుతం ఎవరికీ తెలియదని, ఆయన బయట ఎక్కడా కనిపించడం లేదని డెఫ్రిన్ పేర్కొన్నారు. అయితే, ఎంత దాక్కున్నా ఆయనకు రక్షణ ఉండదని, ఇజ్రాయెల్‌కు ముప్పుగా పరిణమించే ఎవరినైనా వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. కేవలం అగ్ర నాయకులే కాకుండా, ఇరాన్‌లోని శక్తివంతమైన బాసిజ్ దళాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే.. ఇజ్రాయెల్‌పై చేయి ఎత్తితే వారిని మట్టుబెడతాం అని డెఫ్రిన్ హెచ్చరించారు.

ఆ దేశానికి పెద్ద దెబ్బగా

మరోవైపు, ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో ఇరాన్ కీలక నేతలు మరణించడం ఆ దేశానికి పెద్ద దెబ్బగా మారింది. గత కొంతకాలంగా ఇరాన్ వ్యవహారాలను చక్కబెడుతున్న సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీ, అలాగే బాసిజ్ దళాల అధిపతి గులామ్రేజా సులేమానీ ఇద్దరూ హతమైనట్లు ఇరాన్ మీడియా కూడా వెల్లడించింది. వీరు ఇద్దరూ ఇరాన్‌లో ప్రజల నిరసనలను అణచివేయడంలో కీలక పాత్ర పోషించిన వారు. ముఖ్యంగా 2022లో మహ్సా అమిని మరణం తర్వాత జరిగిన ఉద్యమాలను, అలాగే ఈ ఏడాది జనవరిలో జరిగిన అల్లర్లను అణచివేయడంలో వీరిదే ప్రధాన పాత్ర అని సమాచారం.

ఈ పరిణామాలు చూస్తుంటే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఇరాన్ లోని కీలకమైన భద్రతా వ్యవస్థలను దెబ్బతీయడం ద్వారా ఆ దేశాన్ని ఆర్థికంగా, సైనికంగా బలహీనపరచాలని ఇజ్రాయెల్ వ్యూహ రచన చేస్తోంది. కొత్త సుప్రీం లీడర్‌ను సైతం వదిలిపెట్టమని బహిరంగంగా ప్రకటించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

Advertisment
తాజా కథనాలు