/rtv/media/media_files/2026/04/08/vijay-2026-04-08-15-30-44.jpg)
విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన సేలం జిల్లాలోని ఎడప్పాడి నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఏఐఏడీఎంకే అగ్రనేత ఎడప్పాడి పళనిస్వామికి పోటీగా టీవీకే బరిలో లేకుండా పోయింది.
ఈ నియోజకవర్గం నుంచి విజయ్ పార్టీ తరపున బరిలోకి దిగిన అరుణ్ కుమార్ నామినేషన్‌ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే, నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ప్రతిపాదకుల వివరాలను ధృవీకరించలేకపోవడంతో రిటర్నింగ్ అధికారి పి. నటరాజన్ ఆ దరఖాస్తును తిరస్కరించారు. ప్రధాన అభ్యర్థితో పాటు ఆ పార్టీ వేసిన ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్ కూడా ఇదే కారణంతో వీగిపోయింది. అత్యంత ఆసక్తికరంగా మారిన ఈ స్థానంలో తమ పార్టీ అభ్యర్థి పోటీలో లేకపోవడంతో టీవీకే కార్యకర్తలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
తహసీల్దార్ కార్యాలయం వద్ద హైడ్రామా
మరోవైపు, మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. అభ్యర్థి అరుణ్ కుమార్ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఆయనకు భద్రత కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని కార్యకర్తలు నిరసన కూడా తెలిపారు. అయితే, కాసేపటి తర్వాత అరుణ్ కుమార్ వలసైయూర్‌లోని తన నివాసంలో సురక్షితంగా ఉన్నట్లు తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద విజయ్ రాజకీయ అరంగేట్రంలో ఎడప్పాడి స్థానం దక్కకపోవడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు.
Follow Us