Nandini Sidhareddy : నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు...ఏ రచనకు అంటే?

తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన కరోనా నేపథ్యంలో రాసిన అనిమేష అనే కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులను ఇతివృత్తంగా తీసుకుని ఆయన ఈ రచన చేశారు.

New Update
FotoJet (24)

Nandini Sidda Reddy

Nandini Sidhareddy : తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన కరోనా నేపథ్యంలో రాసిన అనిమేష అనే కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులను ఇతివృత్తంగా తీసుకుని ఆయన ఈ రచన చేశారు.  తెలంగాణ ఉద్యమంలో సిధారెడ్డిది ప్రత్యేక పాత్ర. తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ రచయితల సంఘం తదితర సంఘాలను స్థాపించడం ద్వారా ఆయన ఉద్యమానికి తన వంతు సహాకారం అందించారు. సిధారెడ్డి రాసిన కవితలు, కథలు, పాటలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో ఆధరణ పొందాయి.  ఆధునిక తెలుగు కవిత్వంలో నందిని సిధారెడ్డి ఎన్నో పరిశోధనలు చేసి, తన అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ఠ సేవలు అందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమానికి పూర్వమే మంజీరా రచయితల సంఘం స్థాపించి తెలుగు సాహిత్యానికే వన్నె తెచ్చిన ఆయన కృషి మరువలేనిది. ముఖ్యంగా తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను, ఆవశ్యకతను తన శక్తివంతమైన పాటలతో చాటుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్ప ఊపునిచ్చిన ప్రజా కవిగా ఆయనకు గుర్తింపు ఉంది.  తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని తన కలం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం సముచితమే అని చెప్పాలి.తెలంగాణ  రాష్ట్రం సిద్ధించాక నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ సాహిత్య అకాడమీకి తొలి చైర్మన్‌గా సిధారెడ్డిని నియమించారు. 2017 మే 2 నుండి 2020 మే వరకు ఆయన తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ గా పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం

 నందిని సిధారెడ్డి తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, కొండపాక మండలంలోని బందారం గ్రామంలో బాలసిద్ధారెడ్డి - రత్నమాల దంపతులకు 1955, జూన్ 12న జన్మించారు.  సిద్ధారెడ్డి తండ్రి బాల సిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు. కాగా, సిధారెడ్డి విద్యాభ్యాసం బందారం, వెల్కటూరు, సిద్ధిపేటలలో సాగింది. అనంతరం హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.పూర్తిచేసి, 'ఆధునిక తెలుగుకవిత్వంలో సూర్యుడు అనే అంశంపై ఎం.ఫిల్‌ (1981) పట్టా పొందారు. ఆ తర్వాత 'ఆధునిక కవిత్వం, వాస్తవికత - అధివాస్తవికత' పై పరిశోధన చేసి పి.హెచ్.డి (1986) పట్టా అందుకున్నారు.

ఆ తర్వాత ఆయన ఉపాధ్యాయ వృత్తిలోకి ఎంటరయ్యారు. మెదక్‌లో కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేసి తరువాత సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తూ 2012లో రిటైర్‌ చేశాడు. విద్యార్థి దశనుండే కథలు, కవిత్వం రాయడం ఆయనకు అబ్బంది. సాహిత్యంలో ఆయనకు ఉన్న పరిచయం మూలంగా  నవసాహితి, మెదక్ స్టడీ సర్కిల్ అనే సంస్థలను నిర్వహించేవారు. అనంతరం గులాబి అనే చిన్నపత్రికను కూడ నడిపారు. మెదక్‌ జిల్లాలోని కవులందరినీ ఒకే తాటిపైకి తెస్తూ మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంస్థద్వారా పలు సాహితీ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు 'మంజీర' బులెటిన్‌కు సంపాదకత్వం వహించడమే కాకుండా ఏడు కవితాసంకలనాలను వెలువరించడం ఆయనకే చెల్లింది. అనంతరం సోయి అనే పత్రికకు ఎడిటర్‌గా వహించాడు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశాడు.

1997 ఆగస్టులో ఆయన కేవలం ఒకే ఒక గంట వ్యవధిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం - ఆవశ్యకతపై రచించిన కవిత ఆ తర్వాత "నాగేటి చాల్లల్ల" పాటగా ప్రసిద్ధి చెందింది. ఈ కవితలో సిధారెడ్డి తెలంగాణ సంస్కృతి (బతుకమ్మ పండుగ, ఆటపాటలు, బోనాలు, యక్షగానాలు, ఒగ్గు కళారూపాలు) మొత్తాన్ని వివరించడం విశేషం. ఈ  కవితను "పోరు తెలంగాణ" సినిమాలో పాటగా ఉపయోగించారు. ఈ పాటకు నంది అవార్డు కూడా లభించింది. తెలంగాణ మలి దశ ఉద్యమంలో భాగంగా అందెశ్రీ జయజయహే తెలంగాణ, గోరటి వెంకన్న  "గానమా తెలంగాణమా" వంటి కవితలు రాయగా, అంతకంటే ముందే సిధారెడ్డి తెలంగాణపై కవిత రచించడం విశేషం. ఈ కవితలో మొత్తం 10 చరణాలుంటాయి. ఈ కవిత బతుకమ్మ పాటగా కూడా తెలంగాణలో ఇంటింటా మారుమ్రోగింది.

రచనలు 
భూమిస్వప్నం, సంభాషణ, ఆధునిక తెలుగుకవిత్వం - వాస్తవికత - అధివాస్తవికత (సిద్ధాంతగ్రంథం),దివిటీ, ప్రాణహిత, ఒక బాధ కాదు, నది పుట్టుబడి, ఇగురం, ఆవర్థనం, నాగేటి చాల్లల్ల (పాటలు), ఇక్కడి చెట్లగాలి,చిత్రకన్ను (కథా సంపుటి), అనిమేష (దీర్ఘకవిత).

పాటలు

నాగేటి సాల్లల్ల నా తెలంగాణ (పోరు తెలంగాణ-2011), ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలూగేనా.. ఒక నువ్వు ఒక నేను ఊహల్లో తేలేమా (జై బోలో తెలంగాణ-2011), పుడమి పండుగ పువ్వుల జాతర మగువల పండుగ మమతల జాతర (కొలిమి), ఇది చరిత్ర ఇది పవిత్ర జనవిముక్తి సమరం.. సాయుధ రైతాంగ పోరు సాహసమే అమరం (బందూక్-2015).,చెలియా చెలియా విడిపోకే కలలా (2 కంట్రీస్-2017)

పురస్కారాలు

1986లో భూమిస్వప్నం కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం,1988లో భూమిస్వప్నం కవితాసంపుటికి ఇందూరు భారతి వారి దాశరథి పురస్కారం, 2001లో ప్రాణహిత కవితాసంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం. 2009లో ఒక బాధకాదు కవితాసంపుటికి విశ్వకళాపీఠం వారి స్నేహనిధి ఉత్తమ కవితా పురస్కారం, 2010లో 'నాగేటి సాలల్లో నా తెలంగాణా' పాటకు ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారం,2016లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో విశిష్ట పురస్కారం, 2026లో అనిమేష కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

Advertisment
తాజా కథనాలు