LPG vs CNG vs PNG : ఎల్పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ.. అన్ని గ్యాస్‌లే...కానీ, తేడాలేంటో తెలుసా?

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్‌ కొరత ఉందని వింటున్నాం. అయితే చాలామందికి ఈ పదాలకు అర్థం తెలియదు. నిజానికి ఈ మూడు కూడా హైడ్రోకార్బన్ వాయువులే. అయితే వాటిని నింపడం, నిల్వ, సరఫరా, వినియోగించడంలో మాత్రం చాలా తేడా ఉంటుంది.

New Update
FotoJet (30)

LPG, CNG, PNG... all are gases

LPG vs CNG vs PNG : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికాలు ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు. ఈ దాడుల్లో మూడు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అయినా ఏ ఒక్క దేశం వెనక్కు తగ్గటం లేదు. ఆ మూడు దేశాల ఘర్షణ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలపై పడుతుంది. దీనికి కారణం గల్ఫ్ దేశాల నుంచి రావలసిన గ్యా్‌స్‌ సరాఫరా నిలిచిపోవడం. గల్ఫ్‌ దేశాల నుంచి గ్యాస్ రావాలంటే హర్మూజ్‌ జలసంధిని దాటి రావలసిందే. అయితే అక్కడ చమురుతో కూడిన నౌకలను ఇరాన్‌ అడ్డుకుంటుంది. దీంతో చమురు, గ్యాస్‌ దిగుమతులు నిలిచిపోయాయి. ఉద్రిక్తతల కారణంగా ప్రపంచమంతా తీవ్రమైన గ్యాస్ సమస్యను ఎదుర్కొంటోంది. అనేక దేశాలలో గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో  భారతీయులు కూడా పెట్రోల్, గ్యాస్ సంక్షోభం మూలంగా ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలో మనకు ఎల్పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్‌ కొరత ఉందన్న సమాచారం వినవస్తోంది. అయితే చాలామందికి ఈ పదాలకు అర్థం తెలియదు. ఈ క్రమంలో అసలు LPG vs CNG vs PNG అంటే ఏంటో ఒకసారి చూద్దాం.
 
నిజానికి ఎల్పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ.. అనేవి మూడు కూడా హైడ్రోకార్బన్ వాయువులే.అయితే వాటిని నింపే విధానం, నిల్వచేయడం, సరఫరా చేయడం, వినియోగించడంలో మాత్రం చాలా తేడా ఉంటుంది. ఇక వీటిలో ఎల్పీజీ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇది ప్రొపేన్, బ్యూటేన్ వాయువులతో కూడిన మిశ్రమం. ఈ గ్యాస్‌లు ముడి చమురు శుద్ధి చేసినపుడు విడుదలయ్యే సహజ సిద్దమైన వాయువులు. ఈ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌ను సిలిండర్లలో ద్రవ రూపంలో నిల్వ చేస్తారు. అయితే ఈ గ్యాస్‌ వినియోగ సమయంలో మాత్రం వాయువుగా మారి బయటకు వస్తుంది. ఈ ఎల్‌పీజీ గ్యాస్ నే సాధారణంగా మనం వంట గ్యాస్‌గా ఉపయోగిస్తుంటాం.

ఇక రెండవది సీఎన్‌జీ గ్యాస్‌. దీన్ని కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటారు. ఈ గ్యాస్‌ మీథేన్ గ్యాస్‌. ఇది కూడా సహజ వాయువే. అయితే దీన్ని మాత్రం చాలా అధిక పీడనం వద్ద కుదిస్తారు. దీన్ని సిలిండర్‌లోనే నిల్వ చేస్తారు. అయితే దీన్ని అధిక పీడనం వద్ద గ్యాస్ రూపంలో నిల్వ చేస్తారు. ఇది వాయువు రూపంలోనే ఉంటుంది తప్ప ఎప్పటికీ ద్రవ రూపంగా మారదు. ఈ వాయువును వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది కాలుష్యాన్ని తగ్గిస్తుంది. పెట్రోల్, డీజిల్ కంటే తక్కువ ధరకే లభించడం వల్ల దీన్ని ఆటోలు, కార్లు ఇతర వాహనాల్లో ఎక్కువగా ఇంధనంగా వినియోగిస్తున్నారు.  

మూడవది పీఎన్‌జీ గ్యాస్‌ దీన్ని పైప్డ్ నేచురల్ గ్యాస్ అంటారు. ఇదికూడా అధిక మీథేన్ కంటెంట్ కలిగి ఉంటుంది. కాకపోతే ఇది గాలి కంటే తేలికగా ఉంటుంది. దీన్ని తక్కువ పీడనం వద్ద పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తారు. ప్రస్తుతం చాలా దేశాల్లో  పైపులైన్ల ద్వారా ఇళ్లకు లేదా పరిశ్రమలకు నేరుగా గ్యాస్ రూపంలో సరఫరా చేస్తున్నారు. దీనిని వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు ఎక్కువగా ఉపయోగించడం చూడవచ్చు.

Advertisment
తాజా కథనాలు