హర్మూజ్ జలసంధిలో.. భారత నౌకకు దారి చూపిన ఇరాన్ నేవీ

ప్రపంచ ఇంధన రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో గందరగోళం నెలకొంది. అయితే, ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ భారత్ దౌత్య నీతితో పారిశ్రామిక అవసరాలకు కీలకమైన చమురు, గ్యాస్ సరఫరాను కాపాడుకోగలుగుతోంది.

New Update
_Iran Navy

పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్-అమెరికా మధ్య మొదలైన దాడుల పర్వం అంతకంతకూ ముదురుతోంది. ప్రపంచ ఇంధన రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో గందరగోళం నెలకొంది. అయితే, ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ భారత్ దౌత్య నీతితో పారిశ్రామిక అవసరాలకు కీలకమైన చమురు, గ్యాస్ సరఫరాను కాపాడుకోగలుగుతోంది.

ఇరాన్ నేవీ పహారాలో భారత ట్యాంకర్లు
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఇటీవలే ఇండియన్ LPG ట్యాంకర్ అత్యంత ప్రమాదకరమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ నౌకాదళం రక్షణతో సురక్షితంగా దాటగలిగింది. న్యూఢిల్లీ జరిపిన సంప్రదింపుల వల్లే ఇది సాధ్యమైంది. సదరు నౌకలోని అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ సైన్యం నౌక వివరాలు, సిబ్బంది జాతీయతను పూర్తిగా పరిశీలించిన తర్వాతే అనుమతి ఇచ్చింది. సిబ్బంది అంతా భారతీయులే కావడంతో, వారిని ఒక నిర్దేశిత మార్గంలో ఇరాన్ దళాలు సురక్షితంగా ముందుకు నడిపించాయి.

అడుగడుగునా గండం.. అత్యవసర ఏర్పాట్లు

ప్రస్తుతం ఈ జలమార్గం గుండా ప్రయాణం మృత్యువుతో పోరాటం లాంటిదే. పది రోజుల పాటు పర్షియన్ గల్ఫ్‌లో లంగరు వేసిన భారత ట్యాంకర్, అనుమతి లభించిన తర్వాత తన ప్రయాణాన్ని ప్రారంభించింది. యుద్ధం కారణంగా సిగ్నల్స్ నిలిచిపోవడంతో నావిగేషన్ కష్టతరమైంది. దాడుల భయంతో నౌకలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS)ను ఆపివేసి, లైఫ్ రాఫ్ట్‌లను సిద్ధంగా ఉంచుకున్నారు. ఒమన్ గల్ఫ్ వరకు ఇరాన్ రక్షణ కల్పించగా, అక్కడి నుంచి భారత నావికాదళ నౌకలు మన ట్యాంకర్‌ను సురక్షితంగా భారత్‌కు చేర్చాయి.

దౌత్యమే మన ఆయుధం

ప్రపంచ ముడి చమురు, గ్యాస్‌లో 20 శాతం ఈ మార్గం నుంచే వెళ్తుంది. ప్రస్తుత సంక్షోభంపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందిస్తూ.. ఇరాన్‌తో భారత్ జరుపుతున్న నిరంతర చర్చల వల్లే మన ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లు సురక్షితంగా రాగలుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సుమారు 22 భారతీయ నౌకలు చిక్కుకుపోయి ఉన్నాయని, వాటన్నింటినీ సురక్షితంగా తీసుకురావడమే లక్ష్యంగా భారత నావికాదళం నిరంతరం శ్రమిస్తోందని ఆయన పేర్కొన్నారు. సముద్రంలో ల్యాండ్‌మైన్‌లు, డ్రోన్ దాడుల ముప్పు పొంచి ఉన్నప్పటికీ.. భారత్ తన చమురు అవసరాల కోసం అటు దౌత్యం, ఇటు రక్షణ రంగాలను సమర్థవంతంగా వాడుకుంటోంది.

Advertisment
తాజా కథనాలు