హర్మూజ్ జలసంధిలో విషాదం.. భారత చమురు నౌక కెప్టెన్ మృతి

అంతర్జాతీయ సముద్ర జలాల్లో విధి నిర్వహణలో ఉన్న ఓ ఇండియన్ కెప్టెన్ ఆకస్మిక మరణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయిన 'అవానా' అనే చమురు నౌకలో కెప్టెన్‌గా పనిచేస్తున్న రాకేశ్ రంజన్ (43) గుండెపోటుతో మరణించారు.

New Update
_ Captain of Indian oil tanker

అంతర్జాతీయ సముద్ర జలాల్లో విధి నిర్వహణలో ఉన్న ఓ ఇండియన్ కెప్టెన్ ఆకస్మిక మరణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయిన 'అవానా' అనే చమురు నౌకలో కెప్టెన్‌గా పనిచేస్తున్న రాకేశ్ రంజన్ (43) గుండెపోటుతో మరణించారు. యుద్ధ ప్రాంతంలో ఈ ఘటన జరగడం, మృతదేహం విదేశీ గడ్డపై ఉండటంతో ఆయన కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

రాంచీకి చెందిన రాకేశ్‌ రంజన్ గత కొంతకాలంగా 'అవానా' చమురు నౌకకు కెప్టెన్‌గా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఆయన ప్రయాణిస్తున్న నౌక హర్మూజ్‌ జలసంధికి కేవలం 14 నాటికల్ మైళ్ల దూరంలో నిలిచిపోయింది. ఈ క్రమంలో ఈనెల 18న విధుల్లో ఉండగానే రంజన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ప్రాథమికంగా ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తోటి సిబ్బంది గుర్తించారు.

వెంటనే వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించినప్పటికీ, యుద్ధ వాతావరణం కారణంగా ఆ ప్రాంతంలో విమానాలు లేదా హెలికాప్టర్ల ద్వారా తరలింపునకు అనుమతులు లభించలేదు. దీంతో చేసేదేమీ లేక చిన్న పడవ ద్వారా ఆయనను దుబాయ్‌లోని పోర్ట్ రషీద్‌కు తరలించారు. దురదృష్టవశాత్తూ అక్కడికి చేరుకునే లోపే రంజన్ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తేల్చి చెప్పారు. 

పోస్టుమార్టం తర్వాతే స్పష్టత
రాకేశ్‌ రంజన్ మృతికి గుండెపోటు ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణానికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహం దుబాయ్‌లోనే ఉంది. తమ కుటుంబానికి దిక్కుగా ఉన్న రంజన్ మరణవార్త విని భార్య, ఇద్దరు పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని వారు వేడుకుంటున్నారు. ఈ మేరకు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, రాంచీ ఎంపీ సంజయ్ సేథ్‌లకు మృతుడి సోదరుడు వినతి పత్రాలు అందజేశారు. విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ప్రక్రియను వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన స్పందించి, తన సోదరుడి పార్థివ దేహాన్ని తమకు అప్పగించేలా దుబాయ్ అధికారులతో చర్చలు జరపాలని రంజన్ సోదరుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisment
తాజా కథనాలు