/rtv/media/media_files/2026/03/11/gas-2026-03-11-12-53-25.jpg)
యుద్ధం పరిస్థితులు అంతర్జాతీయంగా ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ మూసివేయడంతో పెను సంక్షోభానికి దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంధన రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుండటంతో, సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రభావం భారత్‌పై కూడా తీవ్రంగా పడింది.
భారత్ తన అవసరాలకు కావాల్సిన LPGలో దాదాపు 60 శాతం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి మూతపడటంతో వంట గ్యాస్ కొరత ఏర్పడవచ్చనే భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇంధన భద్రత కోసం ముందస్తు వ్యూహంతో అడుగులు వేస్తోంది. కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా, దిగుమతులను విభిన్న దేశాల నుంచి సేకరించేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్లిష్ట సమయంలో భారత్ మిత్రదేశమైన అర్జెంటీనా వైపు మొగ్గు చూపుతోంది. 2024 కంటే ముందు అర్జెంటీనా నుంచి భారత్‌కు గ్యాస్ సరఫరా అస్సలు ఉండేది కాదు. కానీ ప్రభుత్వం తీసుకున్న చొరవతో 2025లో 22,000 టన్నుల దిగుమతులు జరగగా, 2026 తొలి మూడు నెలల్లోనే అది ఏకంగా 50,000 టన్నులకు చేరడం గమనార్హం. అర్జెంటీనా దక్షిణ అమెరికా ఖండం చివరిలో ఉండటం వల్ల అక్కడి నుంచి భారత్‌కు రవాణా చేయడం పెను సవాలుతో కూడుకున్న పని.
సుమారు 20,000 కిలోమీటర్లు
దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అత్యంత పొడవైన నౌకా మార్గం. ఇప్పటికే అర్జెంటీనాలోని బహియా బ్లాంకా ఓడరేవు నుంచి ఎల్‌పీజీ నౌకలు బయలుదేరాయి. ఇవి మార్చి మొదటి వారంలో భారత్ చేరుకోనున్నాయి. రవాణా ఖర్చులు భారమైనప్పటికీ, దేశంలో గ్యాస్ కొరత రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అర్జెంటీనా రాయబారి మారియానో అగస్టిన్ కౌసినో ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ దేశంలో అపారమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయని, భారత్‌కు దీర్ఘకాలం పాటు సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రస్తుతం భారత్ అర్జెంటీనాకు 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. గ్యాస్‌తో పాటు సోయాబీన్ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, పప్పుధాన్యాలను కూడా మనం అక్కడి నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాము. ఈ పరిణామాలు భారత్ ఇంధన భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, అంతర్జాతీయ విపత్తుల సమయంలోనూ దేశీయ అవసరాలకు ఆటంకం కలగకుండా కాపాడతాయని నిపుణులు భావిస్తున్నారు.
Follow Us