/rtv/media/media_files/2025/06/13/PHXhG7zK8tqMIVqS1VCj.jpg)
న్యూయార్క్ నుండి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో విమానాన్ని ఐర్లాండ్‌లోని షానన్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
న్యూయార్క్‌లోని JFK ఎయిర్‌పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరిన AI102 విమానం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో పైలట్లు ఒక సాంకేతిక లోపాన్ని గుర్తించారు. భద్రతా పరంగా ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని భావించిన పైలట్లు, వెంటనే సమీపంలోని ఐర్లాండ్ అధికారులను సంప్రదించి విమానాన్ని దారి మళ్లించారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు విమానం షానన్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
అందరూ సురక్షితంగా ఉన్నారని
విమానంలో ఉన్న ప్రయాణికులు మరియు సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా సంస్థ అధికారికంగా వెల్లడించింది. "మాకు ప్రయాణికుల భద్రతే ముఖ్యం. సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు నిబంధనల ప్రకారం ముందస్తు జాగ్రత్తగా విమానాన్ని దారి మళ్లించాం. ప్రస్తుతం ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయాలను షానన్ ఎయిర్‌పోర్ట్‌లో కల్పిస్తున్నాం" అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
ప్రస్తుతం ఆ విమానాన్ని ఇంజనీర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లోపం ఎక్కడ ఉందో గుర్తించి సరిచేసే వరకు విమానాన్ని అక్కడే ఉంచనున్నారు. ప్రయాణికులు ఢిల్లీ చేరుకోవడానికి ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. వేరే విమానాన్ని పంపించి వారిని గమ్యస్థానానికి చేర్చారు. ఈ అనుకోని అంతరాయం వల్ల ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి ఎయిర్ ఇండియా సంస్థ విచారం వ్యక్తం చేసింది.
విమానం గాల్లో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు రావడం సహజమే అయినా, పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా దించి అందరినీ కాపాడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Follow Us