/rtv/media/media_files/2026/03/22/terrorists-2026-03-22-20-53-48.jpg)
ఒకప్పుడు ఉగ్రవాదులకు సేఫ్ ప్లేస్‌గా ఉన్న పాకిస్థాన్, ఇప్పుడు వారికి యమపాశంగా మారుతోంది. భారత్ లక్ష్యంగా దశాబ్దాలుగా కుట్రలు పన్నుతున్న ఉగ్రవాద అగ్రనేతలు, వారి అనుచరులు ఇప్పుడు వరుసగా ‘గుర్తుతెలియని వ్యక్తుల’ చేతిలో హతమవుతున్నారు. కరాచీ నుంచి లాహోర్ వరకు, పెషావల్ నుంచి క్వెట్టా వరకు ఏ ప్రావిన్సులో నక్కినా ‘అజ్ఞాత శక్తులు’ వారిని వెతికి మరీ అంతం చేస్తున్నాయి.
తాజాగా లష్కరే తోయిబా (LeT) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ బావమరిది, అంతర్జాతీయ ఉగ్రవాది అబ్దుల్ రెహమాన్ మక్కీ లాహోర్‌లో మరణించాడు. డయాబెటిస్‌తో బాధపడుతున్న అతడు గుండెపోటుతో చనిపోయాడని జమాత్-ఉద్-దావా ప్రకటించినప్పటికీ, దీని వెనుక కూడా ‘గుర్తుతెలియని వ్యక్తుల’ హస్తం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2008 ముంబై దాడుల సూత్రధారుల్లో ఒకడైన మక్కీపై అమెరికా రివార్డు కూడా ప్రకటించింది.
వరుసగా రాలిపోతున్న ‘మోస్ట్ వాంటెడ్’ తలలు
గత రెండేళ్లుగా పాక్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఒక పద్ధతి ప్రకారం సాగుతోంది. ముఖ్యంగా భారత్‌కు వ్యతిరేకంగా పని చేసే ముఠా నాయకులు లక్ష్యంగా మారుతున్నారు.
అమీర్ సర్ఫరాజ్: భారత పౌరుడు సరబ్జీత్ సింగ్‌ను జైలులో చంపిన ఈ అండర్ వరల్డ్ డాన్‌ను 2024లో లాహోర్‌లో కాల్చి చంపారు.
హఫీజ్ సన్నిహితుల వేట: 2025లో లష్కరే కమాండర్ షేక్ మోయిజ్ ముజాహిద్, ముఫ్తీ హబీబుల్లా హక్కానీ, మరియు నిధుల సేకర్త ఖారీ షాజాదా వేర్వేరు ప్రాంతాల్లో హతమయ్యారు.
మౌలానా రహీం ఉల్లా తారిఖ్: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ సన్నిహితుడైన ఇతడిని కరాచీలో కాల్చి చంపారు.
ఖ్వాజా షాహిద్: సుంజువాన్ ఆర్మీ క్యాంప్ దాడి సూత్రధారిని కిడ్నాప్ చేసి తల నరికి చంపడం ఉగ్రవాదుల్లో వణుకు పుట్టించింది.
ఐసీ-814 విమానం హైజాక్ నిందితుడు జహూర్ మిస్త్రీ (2022), ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన అబూ సైఫుల్లా కాలిద్ (2025), రియాజ్ అహ్మద్, జియా ఉర్ రెహ్మాన్ వంటి డజన్ల కొద్దీ ఉగ్రవాదులు గత కొద్ది కాలంగా తుపాకీ గుళ్లకు బలైపోయారు.
తమ దేశంలో జరుగుతున్న ఈ హత్యలపై పాకిస్థాన్ ప్రభుత్వం నోరు మెదపలేకపోతోంది. ఒకవైపు ఈ మృతులంతా తమ దేశంలో లేరని గతంలో బుకాయించిన పాక్, ఇప్పుడు వారి శవాలకు సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడుతోంది. ‘గుర్తుతెలియని వ్యక్తులు’ చేస్తున్న ఈ ఆపరేషన్లతో పాక్ వీధుల్లో స్వేచ్ఛగా తిరిగిన భారత్ వ్యతిరేక శక్తులు ఇప్పుడు ప్రాణభయంతో భూగర్భంలోకి వెళ్తున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ వరుస హత్యలు హెచ్చరిస్తున్నాయి.
Follow Us