Iran drones : గల్ఫ్ దేశాలపై ఇరాన్‌ డ్రోన్ల దాడి..రంగంలోకి ఉక్రెయిన్‌ నిపుణులు

గల్ఫ్ దేశాలపై ఇరాన్‌ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ డ్రోన్ల దాడితో గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. దీంతో ఇరాన్ డ్రోన్ల దాడిని ఎదుర్కోవడానికి గల్ఫ్‌ దేశాలు ఉక్రెయిన్‌ ను సాయం కోరుతున్నాయని ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు.

New Update
Zelenskyy

Zelenskyy

Iran drones : ఇరాన్‌ పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులతో ఆ దేశం తీవ్రంగా నష్టపోతుంది. అనేకమంది నాయకులను కూడా కోల్పోయింది. దీంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్‌ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ డ్రోన్ల దాడితో గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. దీంతో ఇరాన్ డ్రోన్ల దాడిని ఎదుర్కోవడానికి గల్ఫ్‌ దేశాలు ఉక్రెయిన్‌ ను సాయం కోరుతున్నాయని ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. వారు అడిగిన వెంటనే అక్కడి ప్రభుత్వాలకు సహకరించడానికి ఉక్రెయిన్‌కు చెందిన 200 మందికి పైగా  సైనిక నిపుణులు పశ్చిమాసియా దేశాలకు పంపినట్లు ఆయన తెలిపారు. త్వరలో మరికొంతమందిని కూడా అక్కడికి పంపిస్తామని జెలెన్‌స్కీ తెలిపారు. మంగళవారం యూకే లో పర్యటించిన సందర్భంగా ఆయన  ఆ దేశ పార్లమెంటులో  ప్రసంగించారు. ఆ సందర్భంగా  ఈ విషయాన్ని వెల్లడించారు.

కాగా, 2022 నుంచి ఉక్రెయిన్‌ రష్యాతో యుద్ధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో యుద్ధంలో ఆ దేశం తమపై ప్రయోగిస్తోన్న పలు డ్రోన్లను తాము సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు జెలెన్‌స్కీ (Zelenskyy) స్పష్టం చేశారు. వాటిలో ఇరాన్ తయారుచేసిన కామికాజీ డ్రోన్లు, షాహెద్-136 డ్రోన్లు వంటివెన్నో పెద్ద మొత్తంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం వాటినే టెహ్రాన్ గల్ఫ్ దేశాలపై ప్రయోగిస్తోందని వివరించారు. ఆ డ్రోన్లను ఎదుర్కోనే సామర్ధ్యం తమ బృందాలకు ఉందని, ఆ బృందాలు ఇప్పటికే ఖతార్, సౌదీ అరేబియా సహా పలు పశ్చిమాసియా దేశాల్లో పని చేస్తున్నాయని వివరించారు.

 కాగా ఇరాన్ తయారు చేసిన షాహెద్-136 డ్రోన్‌లను రష్యా దిగుమతి చేసుకుందని.. వాటిని ఎలా ప్రయోగించాలో ఇరాన్ రష్యాకు శిక్షణ ఇచ్చిందని జెలెన్‌స్కీ వివరించారు. అంతేకాకుండా వాటిని ఉత్పత్తి చేసే సాంకేతికతను కూడా ఆ దేశానికి నేర్పిందన్నారు. ఆ తర్వాత మాస్కో వాటిని తమ విడి భాగాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కేవలం డ్రోన్లను ఎదుర్కోవడమే కాకుండా.. వాటి తయారీలోనూ తమ దేశం వేగంగా అభివృద్ది చెందుతోందని జెలెన్‌స్కీ వివరించారు. మాతో యుద్ధం వల్ల రష్యాకు వాటిల్లుతోన్న నష్టంలో 90 శాతం తాము కొత్తగా అభివృద్ధి చేసిన డ్రోన్ల మూలంగానే కలుగుతోందని స్పష్టం చేశారు. ప్రపంచంలో అత్యాధునిక డ్రోన్ ఇంటర్‌సెప్టర్‌లను ఉత్పత్తి చేసే అగ్ర దేశాల్లో ఉక్రెయిన్ కూడా ఒకటని జెలెన్‌ స్కీ స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు