ceasefire : యుద్ధ రంగంలోకి హౌతీలు...కాల్పుల విరమణ ప్రయత్నాలు ముమ్మరం

పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ క్రమంలో మూడు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పాకిస్థాన్‌ నాయకత్వంలో సౌదీ అరేబియా, తుర్కియే, ఈజిప్ట్‌ తదితర దేశాలు ఇరు వర్గాలతో ఫోన్‌ల ద్వారాచర్చలు జరుపుతున్నాయి.

New Update
FotoJet (10)

ceasefire

ceasefire : పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్‌ పై ఇజ్రాయెల్‌, అమరికా సాగిస్తు్న్న యుద్ధంతో ఆయా దేశాల్లో సామాన్య ప్రజలు బిక్కుబిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. ఇరాన్‌లో గడచిన నెల రోజులుగా వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కనివిని ఎరుగని ఆస్తి నష్టం జరిగింది. అయినా ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతూనే ఉంది. ఇదిలా ఉండగానే  మూడు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ చర్చలకు పాకిస్థాన్‌ నాయకత్వం వహిస్తుండగా సౌదీ అరేబియా, తుర్కియే, ఈజిప్ట్‌ తదితర దేశాలు ఇరు వర్గాలతో ఫోన్‌ల ద్వారాచర్చలు జరుపుతున్నాయి. కాగా ఈ రోజు, రేపు రెండు వర్గాలు ప్రత్యక్షంగా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు  పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ ఆహ్వానం మేరకు సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్‌ ఫైసల్‌ బిన్‌ ఫర్హాన్‌, తుర్కియే మంత్రి హకాన్‌ ఫిదాన్‌, ఈజిప్ట్‌ మంత్రి బద్ర్‌ అబ్దెలాట్టీ తదితరులు శనివారం నాడే  పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ శనివారం ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు ఫోన్‌ చేసి కాల్పుల విరమణపై చర్చించారు.

యుద్ధ రంగంలోకి హౌతీలు!

ఇదిలా ఉండగా ఒకవైపు ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య సాగుతున్న యుద్ధంలో ఇరాన్‌ అనుకూల హౌతీ గ్రూపు యుద్ధంలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని కీలక ప్రాంతాలు టార్గెట్‌గా  క్షిపణులను ప్రయోగించింది. నిజానికి చాలాకాలంగా హైతీలకు ఇరాన్ అండగా నిలుస్తూ వస్తున్నది. ఈ క్రమంలో యుద్ధం మొదలైన సమయంలోనే వారు ఇరాన్‌కు మద్దతుగా యుద్ధంలోకి వస్తారని భావించినప్పటికీ ఇన్నాళ్లు వారు యుద్ధానికి దూరంగా ఉన్నారు. అంతేకాదు ఇరాన్‌ కు అవసరమైతే తాము యుద్ధంలోకి వస్తామని, అన్ని రకాల ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించారు. అన్నట్లుగానే ఇజ్రాయెల్‌ పై దాడులకు దిగారు.  ఎర్ర సముద్రం నుంచి అరేబియా సముద్రంలోకి వచ్చే కీలకమైన ‘బాబ్‌ అల్‌ మందేబ్‌’ జలసంధి హౌతీలకు అడ్డగా ఉంది. ఇది కూడా హోర్ముజ్‌ జలసంధిలాగే అతి చిన్న మార్గం. దీనిక వెడల్పు కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే. యూరప్‌ దేశాల నుంచి సూయజ్‌ కాలువ, ఎర్ర సముద్రం మీదుగా చాలా కాలంగా ఆసియా దేశాల మధ్య వాణిజ్యం జరుగుతుంది. ఇప్పుడు ‘బాబ్‌ అల్‌ మందేబ్‌’లో నౌకలపై హౌతీలు కనుక దాడులు చేస్తే.. సముద్ర రవాణాకు ఆటంకం తప్పదు. అదే గనక జరిగితే చమురు ధరలు మరింత పెరగడం ఖాయమని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

చర్చలపై ప్రభావం?

కాగా, యెమెన్‌ వేదికగా పనిచేసే ఇరాన్‌ అనుకూల హౌతీలు యుద్ధంలోకి రావడం ఆందోళన కలిగించే అంశం. వీరి రాకవల్ల కాల్పుల విరమణ చర్చలపై ప్రభావం పడే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అదే సమయంలో ఎర్ర సముద్రం నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించే బాబ్‌ అల్‌ మందేబ్‌ జలసంధిలో హౌతీలకు పట్టుంది. అక్కడ కనుక హైతీలు దాడులకు దిగితే.. చమురు సంక్షోభం మరింత తీవ్రమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  దీనివల్ల అమెరికా, యూరప్‌, గల్ఫ్‌ దేశాలపై మరింత ఒత్తిడి పెంచడంతో పాటు.. ఒప్పందంపై చర్చల్లో ఇరాన్‌కు కాస్త అనుకూలత వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

Advertisment
తాజా కథనాలు