America-Iran War: యుద్ధం ఆపడానికి పాక్ ఎందుకు ట్రై చేస్తోంది.. వార్ ఆగితే ఆ దేశానికి వచ్చే లాభం ఏంటి?

పశ్చిమ ఆసియా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. దశాబ్దాల శత్రువులైన అమెరికా, ఇరాన్‌ల మధ్య రాజీ కుదిర్చేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిగా అవతరించింది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగనప్పటికీ, సందేశాలను చేరవేస్తూ ఇస్లామాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది.

New Update
Pakistan mediates

పశ్చిమ ఆసియా యుద్ధంలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. దశాబ్దాల శత్రువులైన అమెరికా, ఇరాన్‌ల మధ్య రాజీ కుదిర్చేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిగా అవతరించింది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగనప్పటికీ, సందేశాలను చేరవేస్తూ ఇస్లామాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది.

రంగంలోకి ట్రంప్ బృందం.. ఇస్లామాబాద్‌లో భేటీ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఓ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్ ప్లాంట్లపై దాడుల ప్రణాళికకు ఐదు రోజుల విరామం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ త్వరలోనే ఇస్లామాబాద్‌లో ఇరాన్ అధికారులతో ముఖాముఖి సమావేశమయ్యే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన తర్వాత ఈ పరిణామాలు వేగవంతమయ్యాయి.

మధ్యవర్తిగా పాకిస్థాన్ ఎందుకు?

టర్కీ, ఒమన్‌లతో పాటు అమెరికా, ఇరాన్ రెండింటితోనూ సత్సంబంధాలు ఉన్న అతికొద్ది దేశాలలో పాకిస్థాన్ ఒకటి. అమెరికాలో ఇరాన్ దౌత్య ప్రయోజనాలకు పాకిస్థానే ప్రాతినిధ్యం వహిస్తోంది. అందుకే, ఈ సంక్లిష్ట పరిస్థితిని చక్కదిద్దడానికి పాక్ సరైన వేదిక అని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.

పాక్ ఉన్న ప్రయోజనాలేంటి?
ఈ శాంతి చర్చల వెనుక పాకిస్థాన్‌కు బలమైన ఆర్థిక, భౌగోళిక కారణాలు ఉన్నాయి.

ఆర్థిక సంక్షోభం: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం పాక్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. హోర్ముజ్ జలసంధి మూసివేతతో పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు 20% పైగా పెరిగాయి. యుద్ధం ముగిస్తేనే పాక్ కోలుకునే అవకాశం ఉంది.
యుద్ధ భయం: ఇరాన్‌తో పాకిస్థాన్ 900 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. ఒకవేళ సౌదీ అరేబియా ఈ యుద్ధంలోకి దిగితే, గతంలో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ కూడా తప్పనిసరిగా యుద్ధంలోకి రావాల్సి ఉంటుంది. ఈ ప్రమాదాన్ని తప్పించుకోవడమే ఇస్లామాబాద్ ప్రధాన ఉద్దేశ్యం.
ట్రంప్‌తో సాన్నిహిత్యం: ట్రంప్ 2.0 ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ అంతర్జాతీయంగా తన పరపతిని పెంచుకోవాలని పాక్ భావిస్తోంది.

"మేము ఐదు రోజుల గడువు ఇచ్చాం, ఇది విజయవంతమైతే సమస్య పరిష్కారమవుతుంది, లేదంటే బాంబు దాడులు కొనసాగుతాయి" అని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఈ చర్చలను పైకి తోసిపుచ్చుతున్నప్పటికీ, తెరవెనుక మిత్రదేశాల ద్వారా సంప్రదింపులు జరుగుతున్నాయని అంగీకరించింది. పాక్ ప్రయత్నాలు ఫలించి పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొంటుందో లేదో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు