/rtv/media/media_files/2025/12/13/machado-2025-12-13-20-04-44.jpg)
వెనిజులాలో అండర్ గ్రౌండ్ లో ఉన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా మచాదో మొత్తానికి బయటకు వచ్చారు. ఆజ్ఞాతంలో ఉన్న ఆమెను అమెరికాకు చెందిన మాజీ సైనిక నిపుణులు ఓ రహస్య ఆపరేషన్ చేపట్టిందని తెలుస్తోంది. మచాదోకు వేషం మార్చి, పడవల్లో ఓ ప్రాంతానికి తీసుకెళ్ళి...అక్కడ నుంచి నార్వేకు తరలించారని తెలుస్తోంది. నోబెల్ శాంతి బహుమతిని మచాదో ఎలా అయినా స్వీకరించాలని అనుకున్నారు. దీని కోసం ఆమె సాయం చేయమని అమెరికా మాజీ సైనికాధికారుల నేతృత్వంలో నడుస్తున్న గ్రే బుల్ రెస్క్యూ ఫౌండేషన్‌ను సంప్రదించారు. దీనికి అంగీకరించిన ఆ సంస్థ చీఫ్ బ్రెయాన్ స్టెర్న్..ఆపరేషన్ గోల్డెన్ డైనమైట్ ను చేపట్టారు. దీని ద్వారా ఆమెను విజయవంతంగా నార్వేకు చేర్చారు. డైనమైట్‌ను కనుగొన్న అల్ఫ్రెడ్ నోబెల్‌కు గుర్తుగా ఆపరేషన్‌కు ఈ పేరును ఎంచుకున్నట్లు బ్రెయాన్ స్టెర్న్ చెప్పారు.
వేషం మార్చి..సముద్రం ద్వారా..
మచాదోను బయటకు తీసుకురావడానికి ముందుగా ఆమెకు వేషం మార్చారు ఆ తరువాత ఆమెను అజ్ఞాతంలో నుంచి బయటకు తీసుకువచ్చారు. తరువాత వెనెజువెలా రాజధాని కారకస్ నుంచి సముద్ర మార్గం ద్వారా వేరే చోటకు తీసుకెళ్ళారు. దీని కోసం చేపల పడవను ఉపయోగించారు. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో ఆ సమయంలో పది మీటర్ల మేర అలలు ఎగసిపడుతున్నాయి. తీవ్ర చలి, పూర్తి చీకటిలోనే ప్రయాణం. కమ్యూనికేషన్ల కోసం ఫ్లాష్‌లైట్ వినియోగించారు. ఇలాంటి పరిస్థితుల్లో మచాదో ప్రయాణం కొనసాగింది. అలా అత్యంత భయానక వాతావరణంలో రెండు పడవలను మార్చి మచాదోను కరేబియన్ తీరానికి చేర్చారు. ఆమె అక్కడ నుంచి నార్వేకు వెళ్ళారు.
ఈలోపు మచాదో దొరక్కుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వేషం మార్చడంతో పాటూ చెక్‌పోస్టుల్లో డిజిటల్ ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. ఫోన్ ద్వారా కూడా ట్రేస్ చేయకుండా చర్యలు తీసుకున్నారు. కరేబియన్ తీరం చేరుకున్నాక...అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆమెను నార్వేకు చేర్చారు. ఈ మొత్తం వ్యవహారానికి మూడు రోజులు పట్టిందని తెలుస్తోంది.
ఈ ఏడాది నొబెల్ శాంతి బహుమతి చాలానే చర్చకు దారి తీసింది. ఎంత ప్రయత్నించినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అది దక్కలేదు. వెనిజులా విపక్ష నేత మరియా కొరీనా మచాదోకు దక్కింది. అయితే గత ఏడాదిగా ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. దాదాపు ఏడాదిగా ఆమె ఎవరికీ కనిపించకుండా దాక్కున్నారు. అక్కడి నుంచే వెనిజులాలోని నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారు. దీంతో ఈమెపై వెనిజులా ప్రభుత్వం విపరీతమైన కోపంతో ఉంది. మచాదోపై క్రిమినల్ కేసులను కూడా నమోదు చేసింది. ముఖ్యంగా కుట్రలు, విద్వేషాన్ని ప్రేరేపించడం, ఉగ్రవాదం వంటి అభియోగాలు ఉన్నాయని.. అందుకే ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా పరిగణిస్తున్నట్లు వెనిజులా అటార్నీ జనరల్ తారెక్ విలియం సాబ్ స్పష్టం చేశారు. బహుమతిని స్వీకరించడానికి దేశం దాటి బయటకు వెళ్తే.. ఆమెను పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని అన్నారు. అరెస్ట్ కూడా చేస్తామని బెదిరించారు.
Follow Us