/rtv/media/media_files/2026/03/18/trump-war-on-iran-2026-03-18-16-25-42.jpg)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై ప్రారంభించిన యుద్ధం (ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ) వ్యతిరేకిస్తూ అమెరికా రాజకీయాల్లో పెను నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ప్రతిపక్ష డెమొక్రాట్లే కాకుండా, ట్రంప్ సొంత పార్టీ (రిపబ్లికన్) నాయకులు కూడా ఈ యుద్ధం రాజ్యాంగ విరుద్ధమని గళమెత్తుతున్నారు. హాలీవుడ్ సెలబ్రెటీలు, అమెరికన్ విద్యావేత్తలు ఇరాన్‌పై ఆర్మీ ఆపరేషన్‌ను వ్యతిరేఖిస్తున్నాయి.
బెర్నీ సాండర్స్
సెనేటర్ బెర్నీ సాండర్స్ ఈ దాడులను "అక్రమమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవి" అని అభివర్ణించారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా యుద్ధం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. "వియత్నాం, ఇరాక్ యుద్ధాల సమయంలో ప్రజలకు అబద్ధాలు చెప్పారు, ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతోంది" అని ఆయన హెచ్చరించారు. యుద్ధం వల్ల అయ్యే బిలియన్ల కొద్దీ డాలర్ల ఖర్చును అమెరికన్ల ఆరోగ్యం, విద్యపై ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
రో ఖన్నా, థామస్ మాస్సీ
ప్రోగ్రెస్సివ్ డెమొక్రాట్ రో ఖన్నా, రిపబ్లికన్ నాయకుడు థామస్ మాస్సీ కలిసి యుద్ధానికి వ్యతిరేకంగా "వార్ పవర్స్ రిజల్యూషన్"ను ప్రవేశపెట్టారు. "అమాయక ఇరాన్ పౌరులు, అమెరికా సైనికుల ప్రాణాలను పణంగా పెట్టే ఈ అంతులేని యుద్ధాన్ని ఆపాలని రో ఖన్నా పిలుపునిచ్చారు. థామస్ మాస్సీ రిపబ్లికన్ అయినప్పటికీ, ట్రంప్ నిర్ణయం రాజ్యాంగబద్ధం కాదని ఆయన తెగేసి చెప్పారు. యుద్ధం ప్రకటించే అధికారం కేవలం పార్లమెంటుకే ఉండాలని ఆయన వాదిస్తున్నారు.
జో కెంట్ - సంచలన రాజీనామా
ట్రంప్ ప్రభుత్వంలో నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్‌గా పనిచేసిన జో కెంట్, ఇరాన్‌పై యుద్ధాన్ని నిరసిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఇరాన్ నుండి అమెరికాకు ఎలాంటి ముప్పు లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ యుద్ధం జరుగుతోందని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొనడం కలకలం రేపింది.
రాండ్ పాల్, టిమ్ కెయిన్
సెనేట్‌లో రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్, డెమొక్రాట్ టిమ్ కెయిన్ కలిసి యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతూ తీర్మానాన్ని తీసుకొచ్చారు. అమెరికా మరో ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లకుండా ఉండాలంటే ఈ యుద్ధం తక్షణమే ఆగాలని రాండ్ పాల్ గట్టిగా వినిపిస్తున్నారు.
'ది స్క్వాడ్'
ఇల్హాన్ ఒమర్, రషీదా త్లైబ్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ వంటి మహిళా నాయకులు ఈ యుద్ధాన్ని మానవతా సంక్షోభంగా పేర్కొంటున్నారు. ఇరాన్‌లోని పాఠశాలలు, ఆసుపత్రులపై జరుగుతున్న దాడులను అంతర్జాతీయ నేరాలుగా వారు పరిగణిస్తున్నారు.
గళమెత్తిన హాలీవుడ్ ప్రముఖులు: హాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఈ సైనిక చర్యలను ఖండిస్తున్నారు.
మార్క్ రుఫెలో: "అవెంజర్స్" స్టార్ మార్క్ రుఫెలో, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించాల్సింది పోయి యుద్ధం వైపు అడుగులు వేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
జాక్ వైట్: ప్రముఖ సంగీతకారుడు జాక్ వైట్, ట్రంప్ నిర్ణయాన్ని ఎద్దేవా చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు పెట్టారు. శాంతిని కాపాడతానని చెప్పి యుద్ధం చేయడం ఏంటని ప్రశ్నించారు.
జాన్ కుసాక్: ఈ యుద్ధాన్ని ఆయన "వాగ్ ద డాగ్ వార్" అని పిలిచారు. ఇతర రాజకీయ ఇబ్బందుల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి యుద్ధాన్ని వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
జేన్ ఫోండా: ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త జేన్ ఫోండా, ఈ యుద్ధం వల్ల అమెరికా సైనికుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రోసీ ఓ డోనెల్ & స్టీఫెన్ కింగ్: వీరు కూడా ఈ దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ శాంతిని నెలకొల్పాలని కోరుతున్నారు.
వ్యతిరేకతకు ప్రధాన కారణాలు:
రాజ్యాంగ అధికారం: అధ్యక్షుడు కాంగ్రెస్ అనుమతి లేకుండా సొంతంగా నిర్ణయం తీసుకోవడం.
ఆర్థిక నష్టం: ఇప్పటికే ఈ యుద్ధం కోసం అమెరికా సుమారు 16.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
ప్రాణనష్టం: యుద్ధంలో ఇరాన్ పౌరులతో పాటు అమెరికా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Follow Us