Strait of Hormuz: గల్ఫ్ దేశాల చమురు కష్టాలు.. ఈ ప్రత్యామ్నాయ మార్గాలు సరిపోతాయా?

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం ప్రపంచ చమురు సరఫరాను అతలాకుతలం చేస్తున్నాయి. వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి మూతపడటంతో  సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు తమ ఎగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి.

New Update
_hormuz strait

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం ప్రపంచ చమురు సరఫరాను అతలాకుతలం చేస్తున్నాయి. వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి మూతపడటంతో  సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు తమ ఎగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. అయితే, నిపుణుల విశ్లేషణ ప్రకారం ఏ మార్గమూ హర్మూజ్‌కు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాలేదు. ప్రపంచానికి అందే చమురులో రోజుకు సుమారు 21 మిలియన్ బ్యారెళ్లు, అలాగే ఐదో వంతు సహజవాయువు కేవలం హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ప్రస్తుత యుద్ధం కారణంగా ఈ సరఫరా నిలిచిపోవడంతో గల్ఫ్ దేశాలు ఇరత మార్గాలపై దృష్టి సారించాయి.

సౌదీ అరేబియా: పర్షియన్ గల్ఫ్ నుండి ఎర్ర సముద్ర తీరానికి చమురును చేరవేసే 'ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్' పై ఈ దేశం ఆధారపడుతోంది. కానీ దీని సామర్థ్యం రోజుకు 5-7 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే. అంటే హర్మూజ్ ద్వారా వెళ్లే దాంట్లో ఇది కేవలం మూడో వంతు మాత్రమే.

యూఏఈ: హర్మూజ్‌తో సంబంధం లేకుండా నేరుగా గల్ఫ్ ఆఫ్ ఒమన్‌కు చమురును పంపే 'హబ్షాన్-ఫుజైరా పైప్‌లైన్'ను ఉపయోగిస్తోంది. ఇక్కడి నుండి భారత్, చైనా వంటి దేశాలకు రవాణా సులభం. అయితే దీని సామర్థ్యం కేవలం 1.5 - 1.8 మిలియన్ బ్యారెళ్లకు మాత్రమే పరిమితం.

ఇరాక్: ఈ దేశానికి ఎర్ర సముద్ర మార్గం లేదు. ఉత్తర ప్రాంతంలోని కిర్కుక్-సిహాన్ పైపులైన్ ద్వారా తుర్కీయేకు చమురు పంపాలని చూస్తున్నప్పటికీ, అది చాలా స్వల్ప పరిమాణమే.

ఎర్ర సముద్రం ఎంతవరకు సురక్షితం?

హర్మూజ్‌కు బదులుగా ఎర్ర సముద్రాన్ని వాడుకోవాలని గల్ఫ్ దేశాలు భావిస్తున్నా, అక్కడ కూడా ముప్పు పొంచే ఉంది. గతంలో గాజా యుద్ధం నేపథ్యంలో యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు ఈ మార్గంలో వాణిజ్య నౌకలపై దాడులు చేశారు. హూతీల తిరుగుబాటుదారులు ఇరాన్‌కు మద్దతుగా ఉంటారు. దీంతో ప్రస్తుతం మౌనంగా ఉన్న హూతీలు ఏ క్షణమైనా రంగంలోకి దిగొచ్చు. గల్ఫ్ దేశాలు ఎర్ర సముద్రాన్ని ప్రత్యామ్నాయంగా వాడటం మొదలుపెడితే, ఇరాన్ ఆదేశాలతో హూతీలు మళ్ళీ దాడులు చేసే అవకాశం ఉంది.

కువైట్, ఖతార్ వంటి దేశాలు పూర్తిగా హర్మూజ్ పైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుత పైప్‌లైన్ల సామర్థ్యం తక్కువగా ఉండటం, మరోవైపు ఎర్ర సముద్రంలో హూతీల భయం వెరసి.. ప్రపంచ చమురు మార్కెట్‌కు మున్ముందు మరిన్ని గడ్డు రోజులు తప్పవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు