/rtv/media/media_files/2026/03/17/gzb-2026-03-17-12-41-44.jpg)
ఘజియాబాద్‌లోని లోనీ పంజాబ్ & సింద్ బ్యాంక్ బ్రాంచ్‌లో దారుణ ఘటన జరిగింది. సెలవు విషయంలో తలెత్తిన వివాదంతో సెక్యూరిటీ గార్డు తన మేనేజర్‌ను కాల్చి చంపడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బలరామ్ నగర్ బ్రాంచ్‌లో సోమవారం మధ్యాహ్నం 1:45 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. మరణించిన వ్యక్తిని అభిషేక్ శర్మగా గుర్తించారు. ఆయన గత ఏడాది కాలంగా ఆ బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. నిందితుడైన సెక్యూరిటీ గార్డు రవీంద్ర హూడా ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాకు చెందినవాడని, అతను కేవలం మూడు నెలల క్రితమే ఈ బ్యాంకులో ఉద్యోగంలో చేరినట్లు సమాచారం.
ఒక్కసారిగా తుపాకీ శబ్దం రావడంతో
ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణం సెలవులేనని పోలీసుల విచారణలో తేలింది. హూడా గత కొన్ని రోజులుగా సెలవు కావాలని కోరుతున్నాడని, దీనిపై మేనేజర్‌తో అతనికి తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. సోమవారం మధ్యాహ్నం కూడా ఇదే విషయంపై ఇద్దరి మధ్య బ్యాంకు లోపలే పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర కోపానికి గురైన హూడా, తన దగ్గర ఉన్న సర్వీస్ డబుల్ బ్యారెల్ 12-బోర్ గన్‌ను తీసుకుని మేనేజర్ శర్మ గుండెపై కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా తుపాకీ శబ్దం రావడంతో బ్యాంకులోని సిబ్బంది, కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. కాల్పులు జరిపిన వెంటనే, నిందితుడు తన తుపాకీతో అందరినీ భయపెడుతూ బయట పార్క్ చేసిన మోటార్ సైకిల్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు.
తీవ్రంగా గాయపడిన మేనేజర్‌ను బ్యాంకు సిబ్బంది, స్థానికులు కలిసి అంబులెన్స్ కోసం ఆగకుండా వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆయనను ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై డీసీపీ సురేంద్రనాథ్ తివారీ స్పందిస్తూ.. కేవలం సెలవు విషయంలో వచ్చిన గొడవే ఈ హత్యకు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించారు.
ప్రస్తుతం పోలీసులు బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు రవీంద్ర హూడాను పట్టుకోవడానికి పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Follow Us