/rtv/media/media_files/2025/01/26/AxqO2xY0dY5cQQOtlsxT.jpg)
Miriyala Apparao Photograph: (Miriyala Apparao)
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రప్రభుత్వం ప్రతి ఏటా పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు, మొదలగు వాటిలో విశిష్ట సేవ చేసినవారికి ఈ అవార్టులను ప్రకటిస్తుంది. వివిధ రంగాలలో కృషిచేసిన భారత పౌరులకు పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాల పేరిట అవార్టులను ప్రకటిస్తుంది.
సింగపూర్, కువైట్‌లలోనూ ప్రదర్శనలు
అందులో భాగంగానే బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు పద్మశ్రీ వరించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెనికి చెందిన ఈయన గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల మరణించారు. నిన్న అంటే జనవరి 25వ తేదీన ఆయన పెద్ద కర్మ జరుగుతుండగా ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటన వెలువడింది. అప్పారావుకు చిన్ననాటి నుంచి కళలంటే ఇష్టం.. దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు.. సింగపూర్, కువైట్‌లలోనూ ప్రదర్శనలు ఇచ్చారు. దాదాపుగా5వేలకు పైగా ప్రదర్శనలిచ్చారు. గానకోకిల, బుర్రకథ టైగర్, వైఎస్‌ఆర్ ఎచీవ్‌మెంట్ వంటి బిరుదులు, పురస్కారాలతోపాటు.. ఎన్నో సత్కారాలు అందుకున్నారు. ఈయనకు ముగ్గురు కుమారులు సుబ్బరాజు, బ్రహ్మాజీ, బాబా.. ఇద్దరు కుమార్తెలు లలిత, శ్రీదేవి ఉన్నారు. వీరంతా బుర్రకథ కళాకారులే కావడం విశేషం.
కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డ్స్ 2025ను జనవరి 25 (శనివారం) ప్రకటించింది. 113 పద్మశ్రీ, 19 పద్మ భూషణ్, 7 పద్మవిభూషణ్ మొత్తం 139 అవార్డులు అందుకోనున్న వారి వివరాలు వెల్లడించారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ఉన్నారు. వైద్యంలో దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, కళారంగంలో నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేఎల్ కృష్ణ (విద్యా, సాహిత్యం), మాడుగుల నాగఫణి శర్మ(కళా రంగం), మిరియాల అప్పారావు (కళారంగం), వి.రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య)లకు పద్మశ్రీ అవార్డులతో సత్కరించనుంది. తెలంగాణ నుంచి మంద కృష్ణ మాదిగ (సామాజిక సేవ) పద్మశ్రీ అవార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.