/rtv/media/media_files/2025/01/27/xpMRcojhoBXS5Nyz2tMh.png)
Photograph: (Supreme Court)
YS JAGAN : వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది సోమవారం వెనక్కి తీసుకున్నారు. ఈ పిటిషన్ పై జనవరి 27న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.బెయిల్ రద్దు చేయడానికి సహేతుకమైన కారణాలను వివరించడంలో పిటిషనర్ విఫలమయ్యారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ మాజీ ఎంపీ రఘు రామకృష్ణం రాజు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు.
జగన్ ఆస్తుల కేసులో ట్రయల్ సరిగా జరగడం లేదని రఘురామకృష్ణరాజు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కేవలం, శుక్ర,శనివారాల్లో మాత్రమే ఈ కేసుపై విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు ప్రత్యేక కోర్టులు రోజువారీగా విచారణ చేయాలని జగన్ తరపు న్యాయవాది కోరారు. దీంతో జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. దీంతో తన పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రఘురామకృష్ణ రాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రిపై నమోదైన కేసుల విచారణ జరగకుండా అడ్డుపడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించే ప్రయత్నం చేశారు. మాజీ ముఖ్యమంత్రికి బెయిల్ మంజూరైన తర్వాత విచారణకు హాజరు కావడం లేదని, కేసుల విచారణ జరగకుండా అడ్డుపడుతున్నారని, మొత్తం విచారణను ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు జగన్‌పై నమోదైన కేసుల్లో సీబీఐ విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తోందని ప్రతివాదులు సుప్రీం కోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. కేసు విచారణలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో పిల్ దాఖలు చేసినట్టు పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వివాదాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తాము హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించాలని పిటిషనర్ కోరారు. హైకోర్టు వివాదం పరిధిలో తాము జోక్యం చేసుకోవడం సరికాదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఇప్పటికే విచారణ జరుగుతుండగా హైకోర్టు పరిధిలోకి జోక్యం చేసుకోవడం, దాని పనితీరును ప్రభావితం చేయడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. పిల్ డిస్మిస్ చేయాలా? ఉపసంహరించుకుంటారా? అని న్యాయమూర్తి ప్రశ్నించడంతో పిటిషనర్ పిల్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పడంతో వ్యాజ్యాన్ని ముగిస్తున్నట్టు ప్రకటించారు.