/rtv/media/media_files/2026/03/22/gandrapalli-2026-03-22-21-47-14.jpg)
ఊరు వల్లకాడైంది.. గ్రామస్థులు భయంతో వణుకుతున్నారు. గ్రామంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో స్వామిజీ ఊరికి కీడు పట్టిందని చెప్పారు. దీంతో ఊరి జనంమంతా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లారు. ఇలాంటివి మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ నిజజీవితంలో కూడా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని ఓ గ్రామంలో ఇలా జరిగింది. గండ్రపల్లి గ్రామం ప్రస్తుతం తీవ్ర భయాందోళనలో ఉంది. గడిచిన మూడు నెలల కాలంలోనే గ్రామంలో 28 మంది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోవడం అక్కడి ప్రజలను కలవరానికి గురిచేసింది. అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాలున్నప్పటికీ.. ఇంత స్వల్ప కాలంలో ఇన్ని మరణాలు సంభవించడంతో గ్రామానికి ఏదో ‘కీడు’ సోకిందని గ్రామస్థులు బలంగా నమ్ముతున్నారు.
3 నెలల్లో 28 మంది మృతి.. ‘కీడు’ సోకిందని ఊరు ఖాళీ చేసిన గ్రామస్థులు!
— ChotaNews App (@ChotaNewsApp) March 22, 2026
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత మూడు నెలలుగా వరుసగా 28 మంది వివిధ కారణాలతో మరణించడం తీవ్ర ఆందోళన కలిగించింది. గ్రామానికి ఏదో ‘కీడు’ సోకిందని బలంగా నమ్మిన గ్రామస్థులు, పురోహితుడి సూచన… pic.twitter.com/lwk9YOCTxF
ఈ పరిస్థితి నుండి బయటపడేందుకు, గ్రామ పెద్దలు ఒక పురోహితుడిని సంప్రదించారు. ఆయన సూచన మేరకు గ్రామంలోని దుష్టశక్తులను పారద్రోలడానికి ‘గ్రామ బహిష్కరణ’ (అంటే ఊరు ఖాళీ చేయడం) అనే సంప్రదాయాన్ని పాటించాలని నిర్ణయించుకున్నారు. ఊరు ఖాళీ చేయాలని ముందుగానే డప్పు కొట్టి అందరికీ సమాచారం అందించారు. తెల్లవారుజామునే గ్రామస్థులంతా తమ ఇళ్లకు తాళాలు వేసి, పశువులను కూడా వెంటబెట్టుకుని ఊరి పొలిమేర దాటారు. రోజంతా ఊరి బయట పొలాల్లోనే గడుపుతూ, అక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేశారు. ఇలా చేయడం వల్ల గ్రామానికి పట్టిన పీడ విరుగడవుతుందని వారి నమ్మకం.
గ్రామమంతా నిర్మానుష్యంగా మారిపోయిన ఈ దృశ్యం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆధునిక కాలంలో కూడా మరణాలకు శాస్త్రీయ కారణాలు వెతకకుండా, ఇలాంటి నమ్మకాలను ఆశ్రయించడం పట్ల మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, వరుస మరణాలతో ప్రాణాలు కోల్పోతామనే భయం ముందు తర్కం పనిచేయడం లేదని గ్రామస్థులు అంటున్నారు.
Follow Us