/rtv/media/media_files/2026/03/22/siddipet-2026-03-22-18-31-13.jpg)
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, రైతుల సంక్షేమం విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో పాటు, రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలోనూ కాంగ్రెస్ గెలవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడి నుంచి గెలిచిన వారికి మంత్రి పదవి ఇస్తానని తెలిపారు. ‘‘గత పాలకులు విపక్ష నేతల నియోజకవర్గాల పట్ల వివక్ష చూపించారు. నేను నేతలను వ్యతిరేకిస్తాను గానీ.. ప్రజల పట్ల వివక్ష చూపను. సిద్దిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చాను. వివక్ష చూపే వ్యక్తినయితే.. ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని కొడంగల్‌కు తీసుకెళ్లేవాడిని’’ అని తెలిపారు.
మళ్లీ అధికారంలోకి వస్తాం...మళ్లీ ఇదే సిద్ధిపేట వేదికగా సభ పెడుతా
— Telugu Stride (@TeluguStride) March 22, 2026
- సీఎం రేవంత్ రెడ్డి #RevanthReddy#Telanganapic.twitter.com/LMmz5aEg2I
రైతు భరోసా నిధుల విడుదల
రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రూ.9 వేల కోట్లను సమకూర్చింది. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.3,590 కోట్లను సీఎం విడుదల చేశారు. ఆదివారం బ్యాంకు సెలవు కావడంతో సోమవారం ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయని ఆయన వెల్లడించారు. మిగిలిన నిధులను రెండు విడతల్లో (రూ.2,650 కోట్లు, రూ.2,760 కోట్లు) 20 రోజుల వ్యవధిలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు రైతుల కోసం తమ ప్రభుత్వం రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు.
పంట మార్పిడిపై అవగాహన
వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని సీఎం సూచించారు. నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కేంద్రం పరిమితంగానే వరి కొనుగోలు చేస్తామని చెబుతున్నందున, డిమాండ్ ఉన్న ఇతర పంటల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు కూరగాయలకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ వల్ల సాగు తగ్గిందని, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా సాధికారత - ఇతర పథకాలు
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని సీఎం చెప్పారు. గతంలో బడా వ్యాపారవేత్తలు మాత్రమే చేసే సౌర విద్యుత్ వ్యాపారాన్ని ఇప్పుడు మహిళా సంఘాలతో చేయిస్తున్నామని తెలిపారు. విద్యా రంగంలో మార్పులు తెస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని, మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందిస్తున్నామని వివరించారు.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం వల్ల యూరియా కొరత ఏర్పడే అవకాశం ఉందని, రామగుండం ఫ్యాక్టరీ యూరియా రాష్ట్ర రైతులకే దక్కేలా బీజేపీ ఎంపీలు సహకరించాలని కోరారు. అంతకుముందు 62 ఎకరాల్లో నిర్మించిన ఫ్యాక్టరీని ప్రారంభించిన ఆయన, రూ.80 కోట్లతో చేపట్టనున్న పామాయిల్ రిఫైనరీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు.
Follow Us