భారత నౌకాదళంలోకి 'మిస్సైల్ పవర్‌హౌస్'.. INS తారాగిరి జలప్రవేశం!

భారత రక్షణ రంగం మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక స్టెల్త్ యుద్ధనౌక ‘INS తారాగిరి’ భారత నౌకాదళంలో చేరబోతోంది. ఏప్రిల్ 3న విశాఖపట్నంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ యుద్ధనౌక కమిషన్ కానుంది.

New Update
_INS Taragiri

భారత రక్షణ రంగం మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమైంది. సముద్ర గర్భంలో శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక స్టెల్త్ యుద్ధనౌక ‘INS తారాగిరి’ భారత నౌకాదళంలో చేరబోతోంది. ఏప్రిల్ 3న విశాఖపట్నంలో జరగనున్న ఒక అట్టహాసమైన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ యుద్ధనౌక అధికారికంగా కమిషన్ కానుంది.

యుద్ధనౌకల రూపకల్పన, నిర్మాణంలో భారత్ స్వయంసమృద్ధి సాధిస్తోందనడానికి 'తారాగిరి' ఒక నిలువెత్తు నిదర్శనం. ప్రాజెక్టు 17ఎ క్లాస్‌లో భాగంగా నిర్మించిన నాలుగో నౌక ఇది. దీనిని ముంబైలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డింగ్ లిమిటెడ్ (MDL) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. సుమారు 6,670 టన్నుల బరువున్న ఈ నౌకలో 75 శాతం కంటే ఎక్కువ స్వదేశీ పరికరాలనే వినియోగించడం విశేషం. ఈ నిర్మాణ ప్రక్రియలో 200కు పైగా ఎంఎస్‌ఎంఈ (MSME) సంస్థలు భాగస్వామ్యం పంచుకోగా, వేలాది మందికి ఉపాధి లభించింది.

'తారాగిరి' ప్రత్యేకతలు
ఈ యుద్ధనౌకను కేవలం ఒక నౌకగా కాకుండా, ఒక కదిలే 'మిస్సైల్ పవర్ హౌస్' గా అధికారులు అభివర్ణిస్తున్నారు.  

సూపర్‌సోనిక్ క్షిపణులు: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ వంటి ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు దీని సొంతం.
గగనతల రక్షణ: మధ్యస్థ స్థాయి ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించే క్షిపణులు (MRSAM) శత్రు విమానాలను ఎదుర్కోగలవు.
మల్టీ ఫంక్షన్ రాడార్: ఒకే సమయంలో పలు లక్ష్యాలను గుర్తించి, వాటిని వెంటాడే సామర్థ్యం దీనికి ఉంది.
స్టెల్త్ టెక్నాలజీ: మునుపటి డిజైన్ల కంటే ఎంతో అధునాతనంగా రూపొందించిన ఈ నౌక, శత్రువుల రాడార్లకు చిక్కకుండా మెరుపు దాడులు చేయగలదు.
బహుముఖ శక్తి: కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ ప్లాంట్‌తో నడిచే ఈ నౌక, అత్యంత వేగంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించి కార్యకలాపాలు నిర్వహించగలదు.

కాంబాట్ మేనేజ్‌మెంట్ సిస్టం
శత్రు దాడులను క్షణాల్లో తిప్పికొట్టేందుకు ఇందులో అత్యాధునిక కాంబాట్ మేనేజ్‌మెంట్ సిస్టంను ఏర్పాటు చేశారు. ఇది నౌకలోని అన్ని ఆయుధ వ్యవస్థలను ఏకోన్ముఖం చేసి, సిబ్బంది నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జలాంతర్గాములను వేటాడి నాశనం చేసే సామర్థ్యం కూడా తారాగిరికి ఉంది. కేవలం యుద్ధాలకే కాకుండా, అంతర్జాతీయ దౌత్య సంబంధాలు, మానవీయ సంక్షోభాల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా తారాగిరి సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 3న జరగబోయే ఈ కమిషనింగ్ వేడుకతో హిందూ మహాసముద్రంలో భారత్ శక్తి మరింత రెట్టింపు కానుంది.

Advertisment
తాజా కథనాలు