అమెరికాకు భారీ ఎదురుదెబ్బ.. ఇరాక్‌లో కూలిన US యుద్ధ విమానం.. యుద్ధంలో నాలుగో ప్రమాదం!

యుద్ధంలో అమెరికా సైన్యానికి మరో గట్టి దెబ్బ ఎదురైంది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా ఇంధనాన్ని నింపే KC-135 స్ట్రాటోట్యాంకర్ విమానం కూలిపోయింది. గాలిలో ఉన్న ఇతర యుద్ధ విమానాలకు ఇంధనం నింపే ఈ భారీ విమానం కుప్పకూలడం అమెరికా రక్షణ రంగానికి పెద్ద నష్టమే.

New Update
_ US KC-135 Stratotanker

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యానికి మరో గట్టి దెబ్బ ఎదురైంది. పశ్చిమ ఇరాక్‌లో నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా ఇంధనాన్ని నింపే KC-135 స్ట్రాటోట్యాంకర్ విమానం కూలిపోయింది. గాలిలో ఉన్న ఇతర యుద్ధ విమానాలకు ఇంధనం నింపే ఈ భారీ విమానం కుప్పకూలడం అమెరికా రక్షణ రంగానికి పెద్ద నష్టమే. ఇప్పటికే అమెరికా ఎయిర్ ఫోర్స్ చెందిన మూడు ఫైటర్ జెట్లు కూలిపోగా.. ఇది నాలుగోది. 

గాలిలో ఇంధనం నింపే 'లైఫ్ లైన్' కట్!

అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించిన వివరాల ప్రకారం, పశ్చిమ ఇరాక్ సరిహద్దుల్లో ఒక మిషన్‌లో ఉన్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సాధారణంగా ముగ్గురు సిబ్బందితో పనిచేసే ఈ KC-135 విమానం, ఫైటర్ జెట్‌లు సుదూర ప్రాంతాలకు వెళ్లి దాడులు చేయడానికి అవసరమైన ఇంధనాన్ని గాలిలోనే సరఫరా చేస్తుంది. ఈ విమానం కూలిపోవడంతో ఆ ప్రాంతంలో యుద్ధ విమానాల కార్యకలాపాలకు కొంత ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఈ విమానాన్ని ఇరాన్ దళాలు కూల్చివేశాయా? అన్న అనుమానాలపై అమెరికా సైన్యం స్పష్టత ఇచ్చింది. ఈ ప్రమాదం శత్రువుల కాల్పుల వల్ల కానీ, లేదా పొరపాటున తమ ఎయిర్‌ ఫోర్స్ కారణంగానో జరగలేదని CENTCOM స్పష్టం చేసింది. టెక్నికల్ ప్రాబ్లమా లేక ఇతర కారణాలా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రెండు విమానాలు ఒకే మిషన్‌లో ఉండగా, ఒకటి సురక్షితంగా ల్యాండ్ అయింది, రెండోది మాత్రం కుప్పకూలింది.

యుద్ధంలో కూలిన నాల్గవ అమెరికా విమానం

ప్రస్తుత ఇరాన్-అమెరికా ఘర్షణలో అమెరికాకు చెందిన విమానం కూలిపోవడం ఇది నాల్గవసారి. అంతకుముందు జరిగిన ఘర్షణల్లో మూడు F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్‌లు కువైట్ దళాల పొరపాటు కాల్పుల వల్ల కూలిపోయాయి. ఆ ఘటనల్లో ఆరుగురు సిబ్బంది ప్రాణాలతో బయటపడగా, తాజా KC-135 ప్రమాదంలో సిబ్బంది పరిస్థితిపై ఇంకా స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది. పెంటగాన్ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు ఈ యుద్ధంలో ఏడుగురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 140 మంది సైనికులు గాయపడగా, వారిలో ఎనిమిది మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్‌పై దాడులు చేస్తున్న అమెరికాకు, వరుసగా జరుగుతున్న ఈ విమాన ప్రమాదాలు, ప్రాణనష్టం పెద్ద సవాలుగా మారాయి.

ఇరాన్ తన ‘మొజాయిక్ డిఫెన్స్’ వ్యూహంతో అమెరికాను ముప్పుతిప్పలు పెడుతోంది. ఒకవైపు ఇరాన్ తన అగ్ర నాయకత్వాన్ని కోల్పోయినా లొంగిపోవడం లేదని ప్రకటించడమే కాకుండా, యుద్ధాన్ని ముగించే సత్తా తమకే ఉందని వార్నింగ్ ఇస్తోంది. ఈ క్రమంలో అమెరికా తన కీలకమైన ట్యాంకర్ విమానాలను కోల్పోవడం యుద్ధ గమనాన్ని ప్రభావితం చేసే అంశంగా రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు