/rtv/media/media_files/2026/01/27/uae-scraps-pakistan-airport-deal-2026-01-27-18-36-47.jpg)
UAE Scraps Pakistan Airport Deal Soon After President’s India Visit
పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పశ్చిమ ఆసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చమురు దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో దేశాన్ని గట్టెక్కించేందుకు ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ సంచలన 'ఆస్టరిటీ మెజర్స్' (కట్టుబాటు చర్యలు) ప్రకటించారు.
చమురు వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం పనిదినాలను కుదించింది. ఇకపై పాకిస్తాన్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వారానికి నాలుగు రోజులు (సోమవారం నుండి గురువారం వరకు) మాత్రమే పనిచేస్తాయి. అయితే, ఈ నిర్ణయం నుండి బ్యాంకులు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు, ఆసుపత్రులు, అంబులెన్స్ వంటి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. విద్యా రంగానికి సంబంధించి, రాబోయే రెండు వారాల పాటు పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఉన్నత విద్యా కమిషన్ పరిధిలోని విద్యార్థులకు తరగతులను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
ఇంధన వినియోగంపై ఆంక్షలు
ప్రభుత్వ వాహనాలకు సంబంధించి షరీఫ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే రెండు వారాల పాటు అన్ని ప్రభుత్వ వాహనాలకు 50% తక్కువ పెట్రోల్ మాత్రమే కేటాయిస్తారు. ప్రభుత్వ వాహన వినియోగాన్ని 60% మేర తగ్గించాలని నిర్ణయించారు. అయితే, అంబులెన్స్‌లు, ప్రజా రవాణా వ్యవస్థకు ఈ ఇంధన కోత వర్తించదు.
మంత్రులు, అధికారుల జీతాల్లో భారీ కోతలు
ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా పాలకులు సైతం త్యాగాలకు సిద్ధపడాలని ప్రధాని పిలుపునిచ్చారు.
మంత్రుల జీతాలు: రాబోయే రెండు నెలల పాటు ఏ ఫెడరల్ మంత్రి, సలహాదారు లేదా ప్రత్యేక సహాయకుడు జీతం తీసుకోరు.
పార్లమెంటేరియన్లు: ఎంపీలందరి జీతాల్లో 25% కోత విధించారు.
ప్రభుత్వ ఉద్యోగులు: రూ. 3,00,000 కంటే ఎక్కువ వేతనం పొందే అధికారుల జీతాల్లో 20% కోత ఉంటుంది.
శాఖల ఖర్చులు: అన్ని ప్రభుత్వ విభాగాల నిర్వహణ ఖర్చులను 20% తగ్గించుకోవాలని ఆదేశించారు.
విదేశీ పర్యటనలపై నిషేధం
ప్రభుత్వ నిధులను ఆదా చేసేందుకు ప్రధాని, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలపై పూర్తి నిషేధం విధించారు. అత్యంత అవసరమైన దేశ ప్రయోజనాల కోసం తప్ప, ఎలాంటి అధికారిక విదేశీ పర్యటనలకు అనుమతి ఉండదని షరీఫ్ స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాల నుండి సరఫరా అయ్యే చమురు ధరలు పెరగడం వల్ల పాకిస్తాన్ ఊపిరాడక కొట్టుమిట్టాడుతోందని, దేశ ప్రజలు ఈ కష్టకాలంలో ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.
Follow Us