Iran war strategies: అగ్రనేతలు చనిపోయినా తగ్గని ఇరాన్ పోరాటం.. ఏమిటీ 'మొజాయిక్ డిఫెన్స్'?

2026 ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్‌గా ప్రారంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తుందని వాషింగ్టన్ భావించింది. కానీ, గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తున్నాయి.

New Update
_Mosaic Doctrine

పశ్చిమ ఆసియాలో యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. 2026 ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్‌గా ప్రారంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తుందని వాషింగ్టన్ భావించింది. కానీ, గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తున్నాయి. ఇరాన్ అగ్ర నాయకత్వం తుడిచిపెట్టుకుపోయినా, ఆ దేశం లొంగిపోకపోవడం ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. దీని వెనుక జనరల్ జాఫారి రూపొందించిన అజేయమైన సైనిక వ్యూహం ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయిన 10 రోజులకు పైన అవుతున్న యుద్ధం ఆగలేదు. ఆయన రెండో కొడుకు మొజ్తబా ఖమేనీ వచ్చాడు. రేపు మొబ్తబా మరణించినా, ఆయన ప్లేస్‌లో మరో వ్యక్తి వచ్చి, అతను కూడా చనిపోయినా, యుద్ధం ఆగదు. ఇరాన్ వార్ ప్లాన్ అలా డిజైన్ చేసింది. 

మొజాయిక్ సిద్ధాంతం

2003లో సద్దాం హుస్సేన్ సైన్యం కేవలం 26 రోజుల్లోనే కుప్పకూలిపోయింది. దీనికి ప్రధాన కారణం అధికారం అంతా సద్దాం చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండటం. అమెరికా దాడులతో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినగానే, స్థానిక అధికారులకు ఆదేశాలు అందక సైన్యం చెల్లాచెదురైంది. ఈ వైఫల్యాన్ని నిశితంగా అధ్యయనం చేసిన IRGC మాజీ కమాండర్ జనరల్ జాఫారి, ఇరాన్‌కు అటువంటి గతి పట్టకూడదని 2005లో ‘మొజాయిక్ సిద్ధాంతాన్ని’ ప్రతిపాదించారు. సాధారణంగా ఏదైనా దేశంపై యుద్ధం జరిగినప్పుడు, ఆ దేశ రాజధానిని ఆక్రమిస్తే లేదా అగ్ర నాయకత్వాన్ని హతమార్చితే ఆ దేశ సైన్యం లొంగిపోతుంది. కానీ మొజాయిక్ సిద్ధాంతం దీనికి భిన్నంగా పనిచేస్తుంది. ఫిబ్రవరి 28 దాడుల్లో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, ఐఆర్జీసీ చీఫ్ పక్‌పూర్ వంటి కీలక నేతలు మరణించినట్లు సమాచారం. అయినప్పటికీ, ఇరాన్ సైన్యం వెనక్కి తగ్గలేదు. జఫారి వ్యూహం ప్రకారం, ఇరాన్ మొత్తం 31 స్వతంత్ర ప్రాంతీయ కమాండ్‌లుగా విభజించబడింది. ప్రతి రాష్ట్రం (ప్రావిన్స్) తన స్వంత క్షిపణులు, డ్రోన్లు మరియు కమాండ్ సెంటర్లను కలిగి ఉంటుంది. టెహ్రాన్‌తో సంబంధాలు తెగిపోయినా, స్థానిక కమాండర్లు స్వయంగా నిర్ణయాలు తీసుకుని యుద్ధాన్ని కొనసాగించగలరు.

'ఆటోపైలట్' మోడ్‌లో 2026 రంజాన్ యుద్ధం

ఈ యుద్ధాన్ని ఇరాన్ ‘2026 రంజాన్ యుద్ధం’గా పిలుస్తోంది. యుద్ధం ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి ఆదేశాల మీదో కాకుండా, ముందే నిర్ణయించిన ప్రణాళికల ప్రకారం ‘ఆటోపైలట్’ మోడ్‌లో సాగుతోంది. "మా రాజధానిపై బాంబులు వేసినా మా సామర్థ్యం తగ్గదు.. యుద్ధం ఎప్పుడు ముగియాలో మేమే నిర్ణయిస్తాం" అని విదేశాంగ మంత్రి అరాఘ్చి చేసిన వ్యాఖ్యలు ఈ మొజాయిక్ వ్యవస్థలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సూచిస్తోంది.

అమెరికా స్థావరాలపై క్షిపణుల వర్షం
నాయకత్వంపై దాడి జరిగిన కొన్ని గంటల్లోనే బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. శత్రువులకు చిక్కని పర్వత ప్రాంతాలు, విశాలమైన అంతర్భాగాలను వాడుకుంటూ ఇరాన్ గెరిల్లా తరహా పోరాటాన్ని చేస్తోంది. కేంద్రీకృత సైన్యాలు ఎలా చనిపోతాయో తెలిసిన జఫారి, ఎప్పటికీ చనిపోని ‘హైడ్రా’ వంటి సైన్యాన్ని సృష్టించారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

గెలవడానికి కాదు.. ఓటమిని అసాధ్యం చేయడానికి!

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇరాన్ సాంకేతికంగా అమెరికా కంటే బలహీనంగా ఉన్నా, వ్యూహాత్మకంగా దానిని సుదీర్ఘ యుద్ధంలోకి లాగడంలో సఫలమైంది. మొజాయిక్ డిఫెన్స్ అనేది గెలవడానికి రూపొందించబడింది కాదు, ఓటమిని అసాధ్యం చేయడానికి రూపొందించబడింది. ఇరాన్ నాయకులు చనిపోయినా, కానీ ఆ దేశపు పోరాట యంత్రాంగం ఇప్పుడు ఒక సంఘటిత మొజాయిక్ లాగా విడివిడిగా ఉంటూనే శత్రువును వేధిస్తోంది.

Advertisment
తాజా కథనాలు