/rtv/media/media_files/2026/03/24/bagher-ghalibaf-2026-03-24-13-38-45.jpg)
గతకొన్ని వారాలుగా పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కొన్ని దేశాలు దాడులకు గురైతే.. మరొకొన్ని దేశాలు చమురు అందక ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 5 రోజులు బ్రేక్ ఇచ్చాడు. ఇరాన్‌పై 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'ని తాత్కాలికంగా నిలిపివేసి, చర్చలకు సిద్ధమని ప్రకటించాడు. ఈ క్రమంలో ఓ పేరు అంతర్జాతీయంగా మారుమోగుతోంది. ఆయనే మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్. ప్రస్తుతం ఇరాన్ పార్లమెంటు స్పీకర్‌గా ఉన్న గాలిబాఫ్, ట్రంప్ అడ్మినిష్ట్రేషన్‌తో సంప్రదింపులు జరుపుతున్న "అత్యున్నత స్థాయి ప్రతినిధి" అని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇరాన్ ‘మొజాయిక్ డిఫెన్స్’ స్ట్రాటజీ ఉపయోగిస్తోంది. ఇందులో దేశాధినేతతో సంబంధం లేకుండా చిన్న చిన్న గ్రూప్‌లు ఏర్పడి శత్రువులపై దాడులు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇరాన్ వార్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తోందో తెలియడం లేదు, ట్రంప్ చర్చలు ఎవరితో చేస్తున్నాడో ఎవరికీ అర్థం అవ్వడం లేదు.
ఎవరీ గాలిబాఫ్?
గాలిబాఫ్ ఇరాన్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన, వివాదాస్పదమైన వ్యక్తి. ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాదు, మాజీ సైనిక అధికారి, పైలట్ కూడా. ఇరాన్ విప్లవ గార్డ్స్ (IRGC)లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1997 నుంచి 2000 వరకు IRGC ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా పనిచేశారు. 2000 నుంచి 2005 వరకు ఇరాన్ పోలీస్ చీఫ్‌గా వ్యవహరించారు. ఈ సమయంలో విద్యార్థుల నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
టెహ్రాన్ మేయర్:
2005 నుండి 2017 వరకు సుదీర్ఘ కాలం పాటు ఇరాన్ రాజధాని టెహ్రాన్ మేయర్‌గా పనిచేశారు. నగరాన్ని ఆధునీకరించడంలో ఆయనకు మంచి పేరు ఉన్నప్పటికీ, భారీ అవినీతి ఆరోపణలు కూడా చుట్టుముట్టాయి. గాలిబాఫ్ వరుసగా 2005, 2013, 2017, 2024 ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ పడి ఓడిపోయారు. అయినప్పటికీ, వ్యవస్థలో ఆయనకున్న పట్టు తగ్గలేదు.
ప్రస్తుత వివాదం ఏమిటి?
ఇరాన్ సర్వోన్నత నాయకుడు ఖమేనీ మరణం తర్వాత దేశంలో ఏర్పడిన నాయకత్వ శూన్యతను గాలిబాఫ్ భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ ఇటీవల ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించగా, ఆ వ్యక్తి గాలిబాఫ్ అని ఇజ్రాయెల్, అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే, గాలిబాఫ్ ఈ వార్తలను ఖండించారు. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని, ఇవి మార్కెట్లను ప్రభావితం చేయడానికి సృష్టించిన "ఫేక్ న్యూస్" అని ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈజిప్ట్, టర్కీ వంటి దేశాల మధ్యవర్తిత్వంతో ఆయన ట్రంప్ బృందంతో టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
గాలిబాఫ్ ఒక వైపు కరుడుగట్టిన సంప్రదాయవాదిగా కనిపిస్తూనే, మరోవైపు రాజనీతిజ్ఞుడిగా వ్యవహరిస్తుంటారు. ఇరాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న యుద్ధ సంక్షోభం నుండి దేశాన్ని గట్టెక్కించగల సామర్థ్యం ఆయనకు ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల శాంతి ఒప్పందంపై గాలిబాఫ్ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపైనే మధ్యప్రాచ్య భవిష్యత్తు ఆధారపడి ఉంది.
Follow Us