/rtv/media/media_files/2026/03/20/nuclear-facilities-2026-03-20-16-54-52.jpg)
ఇరాన్‌లోని ఇస్ఫహాన్ భూగర్భ ప్రాంతంలో నిర్మిస్తున్న కొత్త యురేనియం సుసంపన్నత కేంద్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేంద్రంపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కేంద్రం ప్రస్తుతం పనిచేస్తోందా? లేదా అది కేవలం ఒక ఖాళీ ప్రదేశమా? అన్నది తమకు స్పష్టంగా తెలియడం లేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణు సామార్థ్యాన్ని దెబ్బతీశామని చెప్పుకుంటున్నాయి. ఇరాన్ తెలివిగా వాటిని ముందే ఎక్కడికైనా తరలించిందా? లేకా అమెరికా దాడులకు ప్రభావితం కాకుండా దాచారా అనేది ఇరాన్ రహస్యం.
తనిఖీలకు అందని భూగర్భ కేంద్రం
ట్రంప్ పరిపాలన అధికారులతో చర్చల నిమిత్తం వాషింగ్టన్ సందర్శించిన గ్రోసీ, విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్ అణు కార్యక్రమాలపై పలు సందేహాలను వ్యక్తం చేశారు. ఇస్ఫహాన్ కాంప్లెక్స్ భూగర్భంలో ఉండటంతో, భౌతికంగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావన్నారు. ఒకవేళ ఈ ప్లాంట్ పూర్తయితే, ఇరాన్‌లో ఇది నాలుగో యురేనియం సుసంపన్నత కేంద్రం అవుతుందని ఆయన వివరించారు. ఈ కేంద్రం ఎంత ఆధునికమైనదో, అక్కడ సెంట్రిఫ్యూజ్‌ల అమరిక మొదలైందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
10 అణు బాంబులకు సరిపడా నిల్వలు?
ఐఏఈఏ అంచనాల ప్రకారం, ఇరాన్ వద్ద ప్రస్తుతం 440 కిలోల 60 శాతం సుసంపన్నం చేసిన యురేనియం ఉంది. సాధారణంగా అణు ఆయుధాల తయారీకి 90 శాతం సుసంపన్నత అవసరం. ఒకవేళ ఇరాన్ తన వద్ద ఉన్న నిల్వలను 90 శాతానికి పెంచగలిగితే, అది సుమారు 10 అణు బాంబుల తయారీకి సరిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందనేది ఇప్పుడే చెప్పలేమని అధికారులు స్పష్టం చేశారు.
యుద్ధం వల్ల అగిపోయిన పర్యవేక్షణ
గత ఏడాది (జూన్ 2025)లో ఐఏఈఏ బృందం ఇస్ఫహాన్ కేంద్రాన్ని పరిశీలించాల్సి ఉంది. అయితే, అదే సమయంలో ఇజ్రాయెల్‌తో 12 రోజుల పాటు సాగిన యుద్ధం కారణంగా ఆ అణు కాంప్లెక్స్‌పై దాడి జరిగింది. భద్రతా కారణాల దృష్ట్యా ఐఏఈఏ తన పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామంతో అక్కడ అసలు ఏం జరుగుతోందనే అంశంపై అంతర్జాతీయ సమాజానికి స్పష్టత కరువైంది. "మేము తిరిగి ఆ ప్రదేశానికి వెళ్లి తనిఖీలు చేసినప్పుడు మాత్రమే అక్కడ సెంట్రిఫ్యూజ్‌ల స్థితిగతులపై ఒక అవగాహనకు రాగలం" అని గ్రోసీ స్పష్టం చేశారు. ఇరాన్ అణు సామర్థ్యం పెరుగుతుండటం మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలకు దారితీసేలా కనిపిస్తోంది.
Follow Us