/rtv/media/media_files/2026/03/22/little-india-2026-03-22-16-08-11.jpg)
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఏమాత్రం చల్లారడం లేదు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పోరు మూడు వారాలు గడిచినా, దాడుల తీవ్రత పెరుగుతూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్ అణు నగరంగా పిలవబడే 'డిమోనా'పై ఇరాన్ శనివారం క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రంపై జరిగిన దాడికి ప్రతీకారంగానే, తాము డిమోనాను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడుల్లో సుమారు 33 మంది గాయపడినట్లు సమాచారం.
ఇజ్రాయెల్‌లోని భారతీయ హృదయం
నెగెవ్ ఎడారిలో ఉన్న డిమోనా నగరం కేవలం అణు పరిశోధనా కేంద్రానికే కాదు, భారతీయులతో ఉన్న విడదీయలేని బంధానికి కూడా ప్రసిద్ధి. అందుకే దీనిని ‘లిటిల్ ఇండియా’ అని పిలుస్తారు. ఇక్కడి మొత్తం జనాభాలో సుమారు 30 శాతం మంది భారతీయ సంతతికి చెందిన యూదులే ఉండటం విశేషం. ఈ నగర వీధుల్లో నడుస్తుంటే జిలేబీలు, సోన్ పాప్రి, గులాబ్ జామున్, భేల్‌పురి వంటి భారతీయ వంటకాల సువాసనలు గుబాళిస్తుంటాయి. ఇక్కడ మరాఠీ, హిందీ భాషలు వినిపిస్తుంటాయి. భారత్ లాగే రంగురంగుల వస్త్రధారణ, క్రికెట్ పట్ల అమితమైన ఆసక్తి ఇక్కడ కనిపిస్తుంది. దీపావళి, ఓనం వంటి పండుగలను ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. 2025 నవంబర్‌లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇటీవల జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్‌కు ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
వలసల చరిత్ర
1950, 1960వ దశకాల్లో భారత్ నుంచి పెద్ద ఎత్తున యూదులు ఇజ్రాయెల్‌కు వలస వెళ్లారు. మహారాష్ట్రకు చెందిన బెనే ఇజ్రాయిలీలు, కేరళకు చెందిన కొచిన్ యూదులు, కోల్‌కతాకు చెందిన బాగ్దాదీ యూదులు, అలాగే ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్ నుంచి బెనై మోనాషే కమ్యూనిటీ వారు ఇక్కడ స్థిరపడ్డారు. వీరిలో ఎక్కువ మంది ప్రస్తుతం వజ్రాల వ్యాపారులుగా, ఐటీ నిపుణులుగా రాణిస్తున్నారు.
డిమోనాలో ఉన్న 'షిమోన్ పెరెస్ నెగెవ్ అణు కేంద్రం' ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకం. 1958లో నిర్మాణం ప్రారంభమైన ఈ కేంద్రం, 1964 నుంచి ఆపరేషన్ స్థితిలో ఉంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు పూర్తిగా అడ్డుకోలేకపోవడంతో, అణు కేంద్రం సమీప ప్రాంతాల్లో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్‌లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Follow Us