Andhra King Taluka Review: ఆంధ్ర కింగ్ తాలూకా.. ప్రతి హీరో అభిమానికి అంకితం!

ఆంధ్ర కింగ్ తాలూకా ఒక అభిమాని తన హీరో కోసం ఎంత దూరం వెళ్తాడో చూపించే ఎమోషనల్ స్టోరీ. రామ్, ఉపేంద్ర నటన సినిమాకు బలం, ఎమోషనల్ సీన్స్ బాగా కుదిరాయి. కొంత స్లో ఉన్నప్పటికీ, సినిమా అభిమాని-హీరో బంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపిస్తుంది.

New Update
Andhra King Taluka Review

Andhra King Taluka Review

Andhra King Taluka Review

  • రిలీజ్ డేట్: నవంబర్ 27, 2025. 
  • నటులు: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితరులు. 
  • దర్శకుడు: మహేష్ బాబు పి. 
  • నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్. 
  • సంగీతం: వివేక్ & మెర్విన్. 
  • సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని. 
  • ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్. 

రామ్ పోతినేని(Ram Pothineni) ప్రధాన పాత్రలో నటించిన ఆంధ్ర కింగ్ తాలుకా సినిమా విడుదలకు ముందే పాటలు, ట్రైలర్, ప్రమోషన్లతో మంచి ఆసక్తి రేపింది. కన్నడ స్టార్ ఉపేంద్ర ముఖ్య పాత్రలో కనిపించగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై మా అభిప్రాయం ఇది.

కథ:

ఈ సినిమా 2002లో జరుగుతుంది. వరుసగా తొమ్మిది ఫ్లాప్‌ల తర్వాత కూడా అభిమానులు “ఆంధ్ర కింగ్” అని పిలిచే సూర్య (ఉపేంద్ర) తన 100వ సినిమా షూటింగ్ మొదలుపెడతాడు. కానీ ఆర్థిక సమస్యల కారణంగా షూటింగ్ ఆగిపోతుంది. సినిమా పూర్తవ్వడానికి ఇంకా 3 కోట్లు అవసరం. ఎవరూ సహాయం చేయరు. ఒకరోజు ఆ మొత్తం సూర్య ఖాతాలో పడుతుంది. ఆ డబ్బు పంపింది ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో, అది సాగర్ (రామ్ పోతినేని) అనే చిన్న గ్రామం గోడపల్లి లంకలో ఉండే అభిమాని పంపినదని తెలుస్తుంది. విద్య, రవాణా, కరెంటు కూడా సరిగా లేని ఆ గ్రామంలో నివసించే సాదాసీదా యువకుడు స్టార్‌కు ఇంత పెద్ద సహాయం ఎందుకు చేశాడు? అతని అభిమానంలో ఎంత నిజం ఉంది? భాగ్యశ్రీ బోర్సే పోషించిన మహాలక్ష్మి పాత్ర సాగర్ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? చివరకు సూర్య-సాగర్ ఇద్దరూ చివరకు కలుస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానమే సినిమా.

పాజిటివ్స్:

రామ్ పోతినేని ఒక హీరో అభిమాని పాత్రలో నిజమైన నటన చూపించాడు. అతని మాటలు, ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అభిమానులు తమ హీరోలపై చూపే ప్రేమను రామ్ సహజంగా చూపించాడు. ఉపేంద్ర పాత్ర ఉన్నది తక్కువ అయినా, ప్రతి సీన్‌లో కూడా తన ప్రభావం చూపించాడు. అతని గంభీరమైన నటన పాత్రకు బలం ఇస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కూడా తన పాత్రను చక్కగా చేసింది. ఆమెతో రామ్ మధ్య ప్రేమ సన్నివేశాలు కథలోని ఎమోషన్స్ చాల బాగా కుదిరాయి.  రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ వంటి నటులు ముఖ్య సన్నివేశాల్లో మంచి ప్రాభవం చూపించారు. రామాయణం ఉదాహరణతో గ్రామ పరిస్థితిని పోల్చే సన్నివేశం చాలా బాగుంది. కామెడీ కూడా కొద్దిగా ఉన్నా బాగా పనిచేసింది.

నెగిటివ్స్:

కథలో భావోద్వేగం ఉన్నా, సినిమా కొంచెం స్లో గా  వెళ్తున్న ఫీల్ వస్తుంది. ముఖ్యంగా ఇంటర్వల్ తర్వాత ఎం జరుగుతుందో ముందే తెలిసినా, కొన్ని సన్నివేశాలు అవసరం లేకుండా పొడిగించినట్టు అనిపిస్తుంది. సాగర్ భావోద్వేగాలకు మరింత బలం ఇచ్చే సన్నివేశాలు వచ్చి ఉండాల్సింది. కొన్ని భాగాల్లో ఆ భావం పూర్తిగా చేరదని అనిపిస్తుంది. మొదటి అర్థభాగం మంచి ఆరంభం అయినా, క్రమంగా నెమ్మదిస్తుంది. రెండో భాగంలో కూడా వేగం తగ్గుతుంది. కొంత కట్టుదిట్టంగా ఉండి ఉంటే సినిమా ఇంకా బాగుండేది.

టెక్నికల్:

దర్శకుడు మహేష్ బాబు పి అభిమాని-హీరో బంధాన్ని సున్నితంగా చూపించాడు. కథ ఆలోచన మంచి అయినప్పటికీ, సీన్లు పొడవు వల్ల ప్రభావం కొద్దిగా తగ్గింది. సిద్దార్థ నుని చిత్రీకరణ సినిమాకి ఆకర్షణీయమైన లుక్ ఇచ్చింది. వివేక్- మెర్విన్ సంగీతం కథకు చాలా ప్లస్ అయ్యింది. పాటలు బాగా తెరకెక్కించారు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కొన్ని సన్నివేశాలు తగ్గించి ఉంటే సినిమా స్లో గా ఉంది అనిపించేది కాదు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి, ముఖ్యంగా క్లైమాక్స్‌లోని వరద సన్నివేశం చక్కగా చేశారు.

మొత్తంగా ఆంధ్ర కింగ్ తాలూకా ఒక హీరో అభిమాని ప్రేమ ఎంత గొప్పదో చూపించే హృదయాన్నికదిలించే సినిమా. రామ్ పోతినేని నటన, ఉపేంద్ర గంభీరమైన పాత్ర, భాగ్యశ్రీ అందమైన నటన సినిమా బలాలు. కొంత నెమ్మదిగా సాగినా, కొన్ని బలహీనమైన సన్నివేశాలు ఉన్నా, ఎమోషన్స్ ప్రేక్షకులకు నచ్చుతాయి. సినిమా చివరికి అభిమాని-హీరో మధ్య ఉన్న అనుబంధాన్ని మనసుకు హత్తుకునేలా చూపిస్తుంది.

Advertisment
తాజా కథనాలు